Begin typing your search above and press return to search.

రాష్ట్రాన్ని దాటేసిన కేసీఆర్ '8' ఏళ్ల పండుగ

By:  Tupaki Desk   |   3 Jun 2022 9:32 AM GMT
రాష్ట్రాన్ని దాటేసిన కేసీఆర్ 8 ఏళ్ల పండుగ
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు దిన పత్రికలు (ఒకట్రెండు మినహాయించి).. ఇంగ్లిషు.. హిందీ.. ఉర్దూ.. కన్నడ.. తమిళ.. ఇలా అది కాదు ఇది కాదు అన్నచందంగా తెలంగాణ 8వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని భారీ అంటే భారీగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన కేసీఆర్ సర్కారు తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించటంలో భాగంగా.. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. దానికో లిమిట్ ఉంటుంది కదా? ఏకంగా మూడు.. నాలుగు పేజీల నిలువెత్తు యాడ్స్.. అది కూడా పెద్ద ఎత్తున దినపత్రికల్లో.. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇవ్వటం వెనుక మర్మం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉండి.. ఇప్పటికే పలు రాష్ట్రాలకు వెళ్లి.. వివిధ రాజకీయ పార్టీ నేతలతో భేటీ అయిన కేసీఆర్.. ఇప్పుడు రాష్టర 8వ ఆవిర్భావ దినోత్సవానికి జాతీయ స్థాయిలో మీడియా సంస్థలకు భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు.

ఒకవైపు రాష్ట్రంలో ఇవ్వాల్సిన ఫించన్లు ఇవ్వని కారణంగా పెద్దవయస్కులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటే.. మరోవైపు కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి ఇంత ఆడంబరంగా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ఆవిర్భావంలో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉంటే.. ఇప్పుడు లోటు బడ్జెట్ లోకి వెళ్లిపోవటమే కాదు.. రూ.5లక్షల కోట్ల అప్పును రాష్ట్రానికి కట్టబెట్టిన ఘనత కేసీఆర్ సర్కారుదన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈసారి మూడో తారీఖు వచ్చినా కూడా కొందరు ఔట్ సోర్సింగ్ కాంటాక్టు కార్మికులకు జీతాలు అందలేదంటున్నారు.

ఫించన్లు.. జీతాలు సమయానికి ఇవ్వని సర్కారు.. అందుకు భిన్నంగా జాతీయ స్థాయిలో కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి ప్రకటనలు ఇవ్వటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. పండక్కి ప్రచారం చేసుకోవటం తప్పు లేదు. కానీ.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన వేళ.. ఈ ఆడంబరాలు అవసరమా? అన్నది అసలు ప్రశ్న.