Begin typing your search above and press return to search.

కాజీపేట జంక్షన్ గొడవ పెద్దదవుతోంది : ఓవర్ టు మోడీ

By:  Tupaki Desk   |   23 April 2022 11:30 PM GMT
కాజీపేట  జంక్షన్ గొడవ పెద్దదవుతోంది : ఓవర్ టు మోడీ
X
కేంద్రంతో త‌గువు కార‌ణంగా తెలంగాణ మ‌ళ్లీ అన్యాయం కానుంది. ఇప్ప‌టికే అర‌వై ఏళ్ల వెనుక‌బాటుపై తిరుగుబాటు చేసి సొంత రాష్ట్రం ద‌క్కించుకున్న తెలంగాణ వాదుల‌కు ఈ ప‌రిణామాలు ముఖ్యంగా తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ కు ఈ ప‌రిణామాలు అస్స‌లు అంతుపోల‌కుండా ఉన్నాయి. న్యాయ‌బ‌ద్ధంగా రావాల్సిన ప్రాజెక్టులు (కీల‌కం అయిన పెట్టుబడులు లేదా కేంద్రం ఏర్పాటు చేయాలి అనుకున్న రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ) ఇవ‌న్నీ కూడా గుజరాత్ కు త‌ర‌లిపోవ‌డంతో మోడీపై తీవ్ర ఆగ్ర‌హంతోనూ మ‌రియు ఆవేశంతోనూ గులాబీ బాస్ ఊగిపోతున్నారు. ఈ త‌రుణాన వివాదం మ‌రింత ముదిరి ఛాన్స్ ఉంది.

ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...గ‌త కొద్ది రోజులుగా ఏదో జ‌రుగుతోంది. ఊహించ‌న‌ది ఏదో జ‌రుగుతోంది. అడిగేవారు అడుగుతున్నా ఏదో జ‌రుగుతోంది. అడ్డుకునే వారు అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా సంబంధిత చ‌ర్య లేదా ప్ర‌క్రియ విఫ‌లం అవుతూనే ఉంది.

అంటే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పై కేంద్రం క‌క్ష క‌ట్టిందా ? లేదా ఇక్క‌డ కూడా బుల్డోజ‌ర్ ఫార్ములా ఏద‌యినా ఉప‌యోగించి నేరుగా కాకున్నా ప‌రోక్షంగా కేసీఆర్ పార్టీ ఉనికిని ప్ర‌శ్నార్థకం చేయాల‌న్న ఆలోచ‌న ఏమ‌యినా ఉందా ? ఇవే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి కి చెందిన యాక్టివిస్టులు ప‌దే ప‌దే సంధిస్తున్నారు. ఇంకా ఈ వివాదాన్ని వారు గోల్ మాల్ గుజరాత్ వెర్సస్ గోల్డెన్ తెలంగాణ అని అభివ‌ర్ణిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెబుతున్న విధంగా "రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను గుజరాత్ కు తరలిస్తున్నారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీరుతో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా కూడా రాష్ట్ర బీజేపీ నాయ‌కులు నోరు మెద‌ప‌డం లేదు." ఇదీ ప్ర‌ధానంగా గులాబీ బాస్ వినిపిస్తున్న నిర‌స‌న‌ల గొంతుక.

ఇక కాజీపేట జంక్ష‌న్లో ఏమ‌యిందో చూద్దాం.. ఇక్క‌డ ఏర్పాటు చేస్తాం అని గ‌తంలో కేంద్రం చెప్పిన రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని గుజ‌రాత్ కు త‌ర‌లించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని, దీనిపై తాము న్యాయ‌పోరాటం చేస్తామ‌ని కేసీఆర్ అంటున్నారు.

అదేవిధంగా హైద్రాబాద్లో లో వ‌రల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (డబ్ల్యూహెచ్ఓ) ఏర్పాటు చేయ‌ద‌లుచుకున్న గ్లోబ‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రెడిషిన‌ల్ మెడిస‌న్ ను కూడా మోడీ స్వ‌రాష్ట్రం గుజ‌రాత్ కు త‌ర‌లించుకుపోయి, జామ్ న‌గ‌ర్ లో ఏర్పాటు చేయాల‌నుకోవ‌డం కూడా తెలంగాణ‌కు ద్రోహం చేయ‌డ‌మేన‌ని మండిప‌డుతున్నారు కేసీఆర్. ఇంత జ‌రిగినా లేదా జ‌రుగుతున్నా తెలంగాణ‌కు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజ‌య్ కానీ అర‌వింద్ కానీ ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని గులాబీ శ్రేణులు గ‌గ్గోలు పెడుతున్నాయి.