తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ కూతురు - నిజామాబాద్ ఎంపీ కవిత పంతం నెగ్గింది. వైఎస్ హయాంలో తన తండ్రి కేసీఆర్ పై పోటీ చేసి ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని జగిత్యాలలో చిత్తుచిత్తుగా ఓడించింది. అక్కడితో వైరం ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ జీవన్ మాత్రం ఊరుకోవడం లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా పంతం పట్టారు. టీఆర్ ఎస్ ను ఓడించి తనను అసెంబ్లీలోకి రానివ్వను అని పంతం పట్టిన నిజామాబాద్ ఎంపీ కవితకు షాకిచ్చేందుకు రెడీ అయ్యారు జీవన్ రెడ్డి. వీరిద్దరి పంతం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ ఎస్ కాంగ్రెస్ సీనియర్ నేతలకు చెక్ పెట్టి వారిని ఓడించింది. కేసీఆర్ - కేటీఆర్ - హరీష్ - కవితలు పట్టుబట్టి మరీ ఈసారి తెలంగాణ అసెంబ్లీలోకి సీనియర్ కాంగ్రెస్ నేతలను రానీయ్యలేదు. ఆ పంతం నెగ్గి కాంగ్రెస్ సీనియర్లు ఓడిపోయారు. తమను ఓడించిన టీఆర్ ఎస్ పై ప్రతీకారాన్ని అందరూ వదిలేసినా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రం వదల్లేదు..
అందుకే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జీవన్ రెడ్డి దిగారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ కు వృద్దులు - రైతులు - మహిళల ఓట్లే ఎక్కువగా పడ్డాయి. నిరుద్యోగ యువత - ఉద్యోగులు టీఆర్ ఎస్ కు అస్సలు వేయలేదు. ఉద్యోగ కల్పన విషయంలో కేసీఆర్ జాప్యానికి నిరసనగా యువత టీఆర్ ఎస్ కు ఎక్కువగా వేయలేదు. ఇక పీఆర్సీ సహా పెన్షన్ సమస్యలు తీర్చని కేసీఆర్ సర్కారుపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వారు కూడా వేయలేదు.. తనకు మహిళలు - రైతులు - వృద్ధులే ఎక్కువగా ఓట్లు వేశారని కేసీఆరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు కూడా.
టీఆర్ ఎస్ బలహీనత - కాంగ్రెస్ కు బలమైన నిరుద్యోగ యువత - ఉద్యోగులే ఇప్పుడు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే జీవన్ రెడ్డి వ్యూహాత్మకంగా పట్టభద్రుల బరిలో నిలిచాడు. ఇక టీఆర్ ఎస్ పట్టభద్రులు - ఉపాధ్యాయుల ఎమ్మెల్యేల బరిలో నిలవడం లేదు. ఆయా సంఘాలకే మద్దతు అని ప్రకటించింది. నిరుద్యోగులు - ఉద్యోగులు ఎలాగూ టీఆర్ ఎస్ కు వేయరని గ్రహించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
టీఆర్ ఎస్ వైదొలగిన నేపథ్యంలో జీవన్ రెడ్డి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తరుఫున పట్టభద్రుల బరిలో నిలిచారు. ఆయన గెలుపు లాంఛనమే.. పోటీగా బలమైన నేతలు లేకపోవడంతో ఈజీగా గెలవడం ఖాయం. జీవన్ రెడ్డికి ఉన్న మంచి పేరు కూడా ఆయనకు కలిసివస్తోంది. దీంతో కవిత పంతం పట్టినా కానీ ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టి జీవన్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. ఇలా కవిత-జీవన్ రెడ్డి పోరులో ఇద్దరూ గెలిచినట్టైంది.