Begin typing your search above and press return to search.

మోడీజీ అంటూ కవితక్క థ్యాంక్స్ చెప్పారండోయ్

By:  Tupaki Desk   |   24 Feb 2016 4:34 PM GMT
మోడీజీ అంటూ కవితక్క థ్యాంక్స్ చెప్పారండోయ్
X
మిత్రుడిగా వ్యవహరిస్తూ మోడి నుంచి పెద్దగా సాధించని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొనగాడని చెప్పక తప్పదు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఇష్టం వచ్చినట్లుగా మోడీ సర్కారు మీద విమర్శలు చేయటమే కాదు.. ఎప్పటికప్పుడు విరుచుకుపడటం.. భావోద్వేగపు వ్యాఖ్యలతో మోడీని సైతం ఇబ్బంది పెట్టే వైఖరి కేసీఆర్ అండ్ కో కు మాత్రమే సాధ్యమని చెప్పాలి.

ఓపక్క పొగడటం.. అంతలోనే విమర్శించటం చేస్తున్న టీఆర్ ఎస్ నాయకుల తీరుకు తగ్గట్లే.. తాజాగా మోడీజీ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కమ్ ఎంపీ కవిత ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాలకు ప్రత్యేక సహాయ నిధి కింద ప్రధాని మోడీ రూ.450 కోట్ల నిధులు విడుదల చేయటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణకు మోడీ సర్కారు ఏమీ చేసింది లేదని విమర్శలు చేయటమే కాదు.. ప్రధానిగా పదవీ భాద్యతలు స్వీకరించి 20 నెలలు దాటినా ఒక్కసారి కూడా తెలంగాణకు రాలేదంటూ ఘాటు విమర్శలు చేసే కవిత.. తాజాగా మాత్రం మోడీజీ అని సంబోధిస్తూ థ్యాంక్స్ చెప్పటం గమనార్హం. రూ.450 కోట్ల నిధులు ఇచ్చినప్పుడు ట్విట్టర్లో ఆ మాత్రం థ్యాంక్స్ పోస్ట్ చేయకపోతే బాగుండదు కదా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓపక్క కవిత ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత.. లోక్ సభలో మాట్లాడిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హెచ్ సీయూ ఉదంతంలో రోహిత్ ఇష్యూ గురించి వివరాలు తెసుకునేందుకు తాను.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమార్తె.. ఎంపీ కవితకు చాలాసార్లు ఫోన్లు చేసినా ఇప్పటివరకూ టచ్ లోకి రాలేదని వెల్లడించటం గమనార్హం.