Begin typing your search above and press return to search.

ఏపీలోనూ కేసీఆర్ పార్టీ

By:  Tupaki Desk   |   4 Sep 2016 8:38 AM GMT
ఏపీలోనూ కేసీఆర్ పార్టీ
X
తెలంగాణ కోసం - నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల సాధ‌న కోసం ఆ విర్భ‌వించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ ఎస్‌) ఏపీలోనూ పాగా వేయ‌నుందా? అక్క‌డ కూడా టీఆర్ ఎస్ కారు స‌వారీ చేయ‌నుందా? అంటే ఇటీవ‌లి ప‌రిణామాలు ఔన‌నే సంకేతాన్నే ఇస్తున్నాయి. పాలిటిక్స్‌లో ఏమైనా జ‌ర‌గొచ్చ‌నేది ప్ర‌తి ఒక్క‌రూ చెప్పే మాట‌. ఇప్పుడు ఏపీలోనూ టీఆర్ ఎస్ స్టార్ట‌వుతుంద‌నేది పొలిటిక‌ల్‌గా వినిపిస్తున్న టాపిక్‌. టీఆర్ ఎస్ నేత‌లు - సీఎం కేసీఆర్ కుమారుడు - కూతురు చేసిన కామెంట్ల‌ను ప‌రిశీలిస్తే.. ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. గ‌తంలో కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర స‌మితే కాన‌క్క‌ర్లేద‌ని, తెలుగు రాష్ట్ర స‌మితి అని ఆయ‌న చెప్పుకొచ్చారు. హైద‌రాబాద్‌ లో ఉన్న ఏపీ వాళ్లు కూడా తెలంగాణ బిడ్డ‌లే అన్నారు. ఏపీలోనూ త‌మ పార్టీ స్టార్ట్ చేసేందుకు ఎందుకు వెన‌కాడాల‌న్న‌ట్టు గ‌తంలోనే కేటీఆర్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న సోద‌రి - నిజామాబాద్ ఎంపీ క‌విత కూడా ఏపీకి అనుకూలంగా మాట్లాడారు. మొన్నామ‌ధ్య ఓ ఫంక్ష‌న్‌ లో పాల్గొన్న క‌విత‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని చెప్పారు. అప్ప‌ట్లో ఈవార్త సోష‌ల్ మీడియాలో హాట్ హాట్‌ గా వైర‌ల్ అయింది. ఏపీ ఇబ్బందుల్లో మాట వాస్త‌వ‌మేన‌ని ఆమె అంగీక‌రించారు. హోదా ఇవ్వాల‌నే తాము కూడా కోరుకుంటున్నామ‌ని అన్నారు. ఏపీ అంటే ఉప్పు నిప్పులా ఉండే క‌విత ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మే అయింది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆమె ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీఆర్ ఎస్‌ కి కార్య‌క‌ర్త‌లే బ‌లం అని - కార్య‌క‌ర్త‌లు ఏ ప్రాంతంలో బ‌లంగా ఉంటే అక్క‌డ టీఆర్ ఎస్ ఆవిర్భ‌విస్తుంద‌ని పేర్కొన్నారు.

కార్యకర్తల సంఖ్య పెరుగుతుంటే, ఏ ప్రాంతంలోనైనా టీఆర్ ఎస్ బలపడుతుందని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రా ప్రాంతంలో టీఆర్ ఎస్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉందా? అన్న ప్రశ్నకు 'అలా జరిగితే బాగుంటుంది కదా? అల్టిమేట్ గా కార్యకర్తలు బాగుపడతారు. పార్టీ బాగుపడుతుంది' అని కవిత చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు ఈ కామెంట్లు ఆస‌క్తిగా మారాయి. భ‌విష్య‌త్తులో ఏపీలోనూ కేసీఆర్ హ‌వా సాగుతుందా? అనే ప్ర‌శ్న‌లూ వ‌స్తున్నాయి. ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు! అన్న‌ట్టు.. ఏమో 2019లో ఏపీలో టీఆర్ ఎస్(తెలుగు రాష్ట్ర స‌మితి) కూడా బ‌రిలోకి దిగితే దిగొచ్చు!! ఏపీ ప్ర‌జ‌లు మ‌రి వీరిని ఆద‌రిస్తారో, తిప్పికొడ‌తారో అప్పుడు తేలిపోతుంది.