Begin typing your search above and press return to search.

క‌ల్వ‌కుంట్ల దెబ్బ‌!... అక్క‌డ పోటీకి అంతా నో!

By:  Tupaki Desk   |   19 Feb 2019 5:16 PM GMT
క‌ల్వ‌కుంట్ల దెబ్బ‌!... అక్క‌డ పోటీకి అంతా నో!
X
నిజామాబాద్ లోక్ స‌భ సీటు... ఏళ్లుగా కాంగ్రెస్‌ కు కంచుకోట‌గా కొన‌సాగుతూ వ‌స్తున్న నియోజక‌వ‌ర్గం. తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతున్న స‌మ‌యంలోనూ తెలంగాణ‌లోని చాలా జిల్లాలు - చాలా నియోజక‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ స‌త్తా చాటినా.. నిజిమాబాదు పార్ల‌మెంటు సీటు వ‌ద్ద‌కు వ‌చ్చేసరికి... అక్క‌డ టీఆర్ ఎస్ ప‌ప్పులు ఉడ‌క‌లేదు. సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ మంత్రి - ఉమ్మ‌డి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌ గా వ్య‌వ‌హ‌రించిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ సొంతూరైన నిజామాబాద్ కాంగ్రెస్‌ కు పెట్ట‌ని కోట‌గానే ఉండింది. అయితే ఇదంతా గ‌త‌మే. ఇప్పుడు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. 2004 - 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి బ‌రిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నేత మ‌ధు యాస్కీ గౌడ్‌... తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటైన త‌ర్వాత మాత్రం ఓట‌మిపాల‌య్యారు.

ఇక్క‌డి నుంచి బ‌రిలోకి దిగిన టీఆర్ ఎస్ అధినేత కూతురు క‌ల్వ‌కుంట్ల క‌వితకు గ‌ట్టి పోటీ ఇచ్చిన యాస్కీ... ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి దాదాపుగా అడ్రెస్ లేకుండా పోయార‌నే చెప్పాలి. గ‌డ‌చిన ఐదేళ్ల‌లోనే నిజామాబాద్‌ పై త‌న‌దైన ముద్ర వేసిన క‌విత‌... ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని టీఆర్ ఎస్‌ కు కంచుకోట‌గా మ‌లిచేశారు. ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే... ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా ముందుకు రావ‌డం లేద‌ట‌. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసినా... ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లోని అన్ని పార్ల‌మెంటు నియోజక‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో టికెట్ల‌ను ఆశిస్తున్న నేత‌ల‌తో పాటు ఏ నేత‌ - ఎక్క‌డ నుంచి పోటీ చేస్తే... విజ‌యావ‌కాశాలు మెండుగా ఉంటాయ‌న్న విష‌యంపై కాంగ్రెస్ పార్టీ క‌స‌ర‌త్తులు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ స‌భ సీట్లుంటే అందులో 16 స్థానాల‌కు మంచి పోటీ ఉంద‌ట‌.

అయితే నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏ ఒక్క‌రూ ఆసక్తి చూప‌డం లేద‌ట‌. ఇప్ప‌టిదాకా ఈ స్థానం కోసం సింగిల్ అప్లికేష‌న్ మాత్ర‌మే వ‌చ్చింద‌ట‌. అది కూడా బ‌డా నేత‌ది కాద‌ని స‌మాచారం. దీంతో పార్టీ అధిఫ్ఠాన‌మే అక్క‌డి అభ్య‌ర్థిని ఖ‌రారు చేయాల‌ని రంగంలోకి దిగింద‌ట‌. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి సుద‌ర్శ‌న్ రెడ్డిని సంప్ర‌దిస్తే త‌న‌తో కాద‌ని తేల్చేశార‌ట‌. ఇక రెండు సార్లు అక్క‌డి నుంచి పోటీ చేసిన మ‌దు యాస్కీ కూడా ఈ ద‌ఫా అక్క‌డ తాను పోటీ చేయ‌లేన‌ని చెప్పార‌ట‌. దీంతో షాక్ తిన్న అధిష్ఠానం... సుద‌ర్శ‌న్ రెడ్డి - మ‌ధు యాస్కీలు కాకుండా అక్క‌డి నుంచి ఎవ‌రు పోటీ చేస్తే బాగుంటుంద‌న్న విష‌యంపై ఓ ఐదు పేర్ల‌తో జాబితా పంపాల‌ని డీసీసీకి ఆదేశాలు జారీ చేసిందిట‌. అంద‌రూ పోటీకి నిరాక‌రిస్తుంటే... కాంగ్రెస్ అధిష్ఠానం అక్క‌డి నుంచి ఎవ‌రిని దింపుతుందో చూడాలి.