Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మీద సానుభూతి ఉందంట కానీ..

By:  Tupaki Desk   |   27 April 2016 4:43 AM GMT
ఫ్యామిలీ మీద సానుభూతి ఉందంట కానీ..
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. చాలా తక్కువగా మాత్రమే కనిపించే ఒక దృశ్యం వారింట్లో కనిపిస్తుంది. కేసీఆర్ మాదిరే ఆయన కుమారుడు.. కుమార్తె ఇద్దరూ మాటకారులే. తమ వాదనతో ఎదుటోళ్లను కన్వీన్స్ చేయటంలో వారు దిట్ట. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా. తాజాగా జరుగుతున్న పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటున్న అంశాల మీద ఎంపీ కవిత స్పందించారు.

నిజానికి పాలేరు ఉప ఎన్నిక ఇన్ చార్జ్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నా.. ఆయన రియాక్ట్ కాకుండా కవిత మాట్లాడటం ఆసక్తికరం. పాలేరు నియోజకవర్గానికి దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ధికి ప్రతిఫలంగా ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలంటూ రాంరెడ్డి ఫ్యామిలీ తెలంగాణ ముఖ్యమంత్రిని కోరింది. దీనిపై ఆయన నుంచి ఎలాంటి స్పందనా లేదు.

ఆ తర్వాత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలంటూ రాంరెడ్డి కుటుంబ సభ్యులు కోరటం.. దానికి సమయం లేదంటూ కేసీఆర్ తిరస్కరించటం లాంటివి చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనల కారణం వస్తున్న విమర్శలకు చెక్ చెప్పాలన్న ఉద్దేశంతోనే కవిత మాట్లాడినట్లు కనిపిస్తుంది. ఆమె మాటల్ని చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది కూడా. తమ పార్టీకి వెంకటరెడ్డి ఫ్యామిలీ పట్ల సానుభూతి ఉందని.. కానీ కాంగ్రెస్ పార్టీ మీద లేదన్న కవిత.. తాము అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నేతలు మద్దతు పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.

పాలేరు ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మంత్రి తుమ్మలను అభ్యర్థిగా నియమిస్తూ వ్యూహాత్మక ఎత్తుగడ తాజా ఎదురుదాడికి ఉపయోగపడుతున్నట్లు కనిపించక మానదు. ఇదిలా ఉంటే.. రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం మీద అంత సానుభూతే ఉంటే.. ఆపరేషన్ ఆకర్ష్ లో వారిని పార్టీలోకి తీసుకొచ్చి.. ఆ స్థానాన్ని వారికే కట్టబెడితే సరిపోతుందిగా? ఒకవేళ ఇది అత్యాశే అనుకుంటే.. రాజకీయాల సంగతి తర్వాత.. అంత సానుభూతే ఉండి ఉంటే కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇచ్చి ఉండొచ్చుగా? అలాంటిది కూడా ఎందుకు జరగనట్లు? దాన్నెలా తీసుకోవాలో..?