Begin typing your search above and press return to search.

తొలిసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి.. తాజాగాప్రత్యేక విమానంలో కవిత జర్నీ

By:  Tupaki Desk   |   20 March 2023 9:09 AM GMT
తొలిసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి.. తాజాగాప్రత్యేక విమానంలో కవిత జర్నీ
X
ప్రజల గురించి.. ప్రజాధనం గురించి తరచూ సుద్దులు చెప్పే నేతల వ్యక్తిగత వ్యవహారాలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయాలు కొన్నిసార్లు బయటకు వచ్చినప్పుడు విస్మయానికి గురి చేస్తుంటాయి. ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాలు బయటకు తీసి బయటకు వెళ్లాలంటే.. కచ్ఛితంగా ప్రత్యేక విమానం ఉండాల్సిందే. ఈ తీరు తరచూ చర్చకు రావటంతోపాటు.. మరీ అంతలా ఎందుకు? దీనికి అయ్యే ఖర్చు ప్రజల మీదే పడుతుంది కదా? అన్న మాట వచ్చినా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవటం తెలిసిందే.

ముఖ్యమంత్రుల ప్రత్యేక విమాన ప్రయాణాల మీద చర్చ జరిగే వేళ.. తాజాగా బయటకు వచ్చిన ఉదంతం గురించి తెలిస్తే.. ఔరా అనుకోవాల్సిందే. తాజాగా ఈడీ విచారణ కోసం ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. ప్రత్యేక విమానంలో వెళ్లిన వైనం చూస్తే.. ఎంత వైభోగం అనుకోకుండా ఉండలేం. తొలిసారి ఈడీ విచారణను ఎదుర్కోవటం కోసం ఢిల్లీ వెళ్లిన సందర్భంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణించిన ఆమె.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి బయలుదేరి వెళ్లటం గమనార్హం.

తాజా ప్రయాణంలో కవితతో పాటు.. ఆమె వెంట  రాష్ట్ర ఐటీ మంత్రి కమ్ సోదరుడు కేటీఆర్.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్రపై సందేహాలు వ్యక్తం కావటం.. దీనికి సంబంధించి ఆమె పాత్ర కీలకమన్నట్లుగా ఈడీ తన రిపోర్టుల్లో పేర్కొనటం తెలిసిందే.

తొలిసారి విచారణ అనంతరం రెండోసారి విచారణకు గైర్హాజరు అయిన ఆమె.. ఈడీ తీరును తప్పు పట్టటంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. దీనిపై విచారణను ఈ నెల 24కు వాయిదావేయటం తెలిసిందే.

మరోవైపు కవిత ఉదంతంలో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని విన్నవించుకుంటూ ఈడీ కేవియట్ పిటిషన్ వేయటం ద్వారా.. కవిత విషయంలో ఈడీ ఎంతటి పట్టుదలతో ఉందో అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో తాజా విచారణపై ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంత సీరియస్ గా ఉందన్నది అర్థమవుతుంది. దీంతో.. ఈ రోజు విచారణ తర్వాత ఏం జరుగుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.