Begin typing your search above and press return to search.

ఎంపీ ప‌ద‌వి క‌విత‌కు ఇష్టం లేదా..!

By:  Tupaki Desk   |   25 July 2016 1:22 PM GMT
ఎంపీ ప‌ద‌వి క‌విత‌కు ఇష్టం లేదా..!
X
రాజ‌కీయాల‌న్నాక వార‌సులు. వారి ఆధిప‌త్యాలు మామూలే. అయితే, ఇది కొన్ని సార్లు ఇబ్బందులు పెడుతుండ‌డ‌మే ఆలోచించాల్సిన విష‌యం. తాజాగా, తెలంగాణలో టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ కు ఈ వార‌స‌త్వ రాజ‌కీయాలే కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఒక ప‌క్క కొడుకు కేటీఆర్‌ ను లైన్‌ లో పెట్టాల‌ని, భావి సీఎంను చేయాల‌ని ఆయ‌న తెగ ప్లాన్లు మీద ప్లాన్లు వేసేస్తూ.. ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేసేస్తున్నారు. దీనికి త‌గిన‌ట్టుగానే కేటీఆర్ తండ్రి చూపించిన బాట‌లో త‌న‌దైన స్టైల్‌ లో దూసుకుపోతున్నారు. ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌లు - అధికారుల‌తో చ‌ర్చ‌లు - స‌మావేశాలు - ప్ర‌జ‌ల్లో మ‌మేకం కావ‌డం - మంత్రుల‌తో సైతం క‌లుపుగోలుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. అబ్బో ఒక‌టేమిటి అన్నిందాలా.. కేటీఆర్ దూసుకుపోతున్నారు.

మ‌రి ప‌రిస్థితి ఇంత సూప‌ర్‌గా ఉంటే కేసీఆర్‌ కు త‌ల‌నొప్పి రావ‌డానికి కార‌ణాలు ఏం ఉంటాయి చెప్మా! అక్క‌డికే వ‌స్తున్నాం. వార‌స‌త్వం విష‌యంలో కేసీఆర్ ఆలోచ‌న ఇలా ఉంటే, ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీష్‌ రావు వ్య‌వ‌హారం మ‌రోలా ఉంది. రాజ‌కీయ వ్యూహాలు - ఎదురుదాడులు..ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ లు..సామ‌దాన‌భేద దండోపాయాలు ప్ర‌యోగించ‌డంలో త‌న‌కంటే ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీష్‌ రావు రెండాకులు ఎక్కువే చ‌దివాడు అంటారు. హ‌రీష్‌ రావు కూడా సీఎం ప‌ద‌విపై క‌న్నేశార‌ని ఎప్ప‌టి నుంచో టాక్ ఉంది. ఇదే విష‌యంపై విప‌క్షాలు కూడా హ‌రీష్ ఎప్ప‌టికైనా కేసీఆర్‌ కు చెక్ పెడ‌తార‌ని వ్యాఖ్యానిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక‌, కేసీఆర్ త‌న‌య క‌విత విష‌యానికి వ‌చ్చేస‌రికి.. ఈమె కూడా రాష్ట్ర రాజ‌కీయాల్లోనే ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అదేంటి.. ఈమె ఎంపీగా ఉన్నారు క‌దా అంటున్నారా? అవును. కేసీఆర్ ఎన్నో ఆశ‌ల‌తో ఈమెను ఎంపీని చేశారు. తెలంగాణ సాంస్కృతిక జాగృతి త‌ర‌పున తెలంగాణ ఉద్య‌మాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన ఆమె గ‌త ఎన్నిక‌ల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఘ‌న‌విజ‌యం సాధించారు.

ఇక క‌విత కేంద్రంలో మంత్రి ప‌ద‌విని కూడా ఆశిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, అనుకున్న‌ది ఒక్క‌టి అయింది ఒక్క‌టి అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తుంటే క‌విత కేంద్రంలో వెలిగే ఛాన్సులు లేన‌ట్టే క‌నిపిస్తోంది. ఇక కవిత ఎంపీగా ఉన్నా కేంద్రంలో ఆమెకు అనుకున్న మైలేజ్ రావ‌డ‌ట్లేద‌న్న భావ‌న ఆమెలో ఉన్న‌ట్టు ఇన్న‌ర్ పొలిటిక‌ల్ వ‌ర్గాల టాక్‌.

కేంద్రంలో క‌న్నా క‌విత ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌పైనే కాన్సంట్రేట్ చేస్తోంద‌ట‌. అంటే ఈమె కూడా సీఎం ప‌ద‌విమీద క‌న్నేసిందా ఏంటి ? అనే అనుమానాలు అంద‌రికీ క‌లుగుతున్నాయి. క‌విత కూడా తెలంగాణ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తే అప్పుడు హ‌రీష్‌ - కేటీఆర్‌ - క‌విత‌ల‌తో కేసీఆర్ త్రిశంకు స్వ‌ర్గంలో చిక్కుకున్న‌ట్ల‌వుతుంది. అప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌కంటే కేసీఆర్ ఇంటి రాజ‌కీయాలే పెద్ద హాట్ టాపిక్ అవుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.