Begin typing your search above and press return to search.

ఎస్పీని క‌విత అంత మాట అన్నారంట‌

By:  Tupaki Desk   |   26 July 2015 9:42 AM GMT
ఎస్పీని క‌విత అంత మాట అన్నారంట‌
X
చేతిలో అధికారం ఉండాలే కానీ కుందేలు పిల్ల సైతం పులిలానే గ‌ర్జిస్తుంది. ప‌వ‌ర్ ప‌రిస్థితి అలాంటిది. పోలీసు అధికారుల‌పై రాజ‌కీయ నేత‌లు విరుచుకుప‌డ‌టం.. చిరాకు ప‌డ‌టం కొత్తేం కాదు. కానీ.. ఒక ఉన్న‌తాధికారిపై ప‌రుషంగా వ్యాఖ్య‌లు చేయ‌టం చాలా అరుదుగా జ‌రిగేది. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ క‌విత వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఆమె ఒక జిల్లా ఎస్పీని ఉద్దేశించి ప‌రుషంగా వ్యాఖ్య‌లు చేశార‌న్న వార్త సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా చెప్పుకొస్తున్నారు. గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా శ‌నివారం ముగింపు ఉత్సావాన్ని పుర‌స్క‌రించుకొని.. ఎంపీ క‌విత వ‌రంగ‌ల్‌జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె.. మంగంపేట పుష్క‌ర ఘాట్ లో ఉన్న‌ప్పుడు క‌విత‌ను చూసేందుకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఎగ‌బ‌డ్డారు.

ఆ స‌మ‌యంలో రోప్ పార్టీని ఆమెకు భ‌ద్ర‌త కోసం ఏర్పాటు చేసినా.. వారిని తోసుకొని మ‌రీ ఆమెను చూసేందుకు ఆస‌క్తిని ప్ర‌దర్శించార‌ట‌. ఈ సంద‌ర్భంగా క‌విత తీవ్ర అస‌హ‌నానికి గురైన‌ట్లుగా చెబుతున్నారు.

త‌న‌ను చూసేందుకు తొక్కిస‌లాట జ‌రిగేలా చేస్తున్నా.. ప్ర‌జ‌ల్నినియంత్రించ‌టంలో పోలీసులు స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌టం లేదంటూ మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆమె జిల్లా ఎస్పీ అంబ‌ర్ కిషోర్ ఝూపై విరుచుకుప‌డిన‌ట్లు చెబుతున్నారు. జ‌నాల్ని నియంత్రించ‌లేన‌ప్పుడు.. నీ మాట‌ను ఎవ‌రు ప‌ట్టించుకోన‌ప్పుడు నీ త‌ల మీద టోపీ అవ‌స‌ర‌మా? అంటూ ప‌రుషంగా మాట్లాడిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజానిజాల మాటేమోకానీ.. ఒక‌వేళ క‌విత అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉంటే..ఆమె త‌న దురుసుత‌నాన్ని త‌గ్గించుకోవాల్సి ఉంది. ఒక‌వేళ అలాంటిదేమీ లేకుంటే మాత్రం.. ఇలాంటి వార్త‌లు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌న్న విష‌యంపై దృష్టి పెడితే మంచిది.