Begin typing your search above and press return to search.

సింహం సింగిల్ అయితే..ఈ హడావుడేంది క‌విత‌!

By:  Tupaki Desk   |   24 Sep 2017 5:01 AM GMT
సింహం సింగిల్ అయితే..ఈ హడావుడేంది క‌విత‌!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార్తె.. ఎంపీ క‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మాట‌లు చెప్పే విష‌యంలో తండ్రిని ఫాలో అయ్యే క‌విత.. తాజాగా త‌న ఫోక‌స్ సింగ‌రేణి ఎన్నిక‌ల మీద పెట్టారు. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షం మొత్తం దానిపైనే ఫోక‌స్ చేశార‌ని చెప్పాలి.

మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాన‌ప్ప‌టికీ.. సింగ‌రేణి ఎన్నిక‌ల‌పై టీఆర్ ఎస్ ఇస్తున్న ప్ర‌యారిటీ అంతా ఇంతా కాదు. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా సింగ‌రేణి ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు గ‌ని కార్మికుల సంఘం విజ‌యం సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. అయితే.. త‌మ ప్రాధాన్య‌త‌ను మ‌రీ బ‌య‌ట పెట్టుకోకుండా ఎక్క‌డెంత హ‌డావుడి చేయాలో అంతే హ‌డావుడి చేస్తున్న వైనం ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే ఈ ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రులు ప‌లువురు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఏమేం చేయాలో ఇప్ప‌టికే డిసైడ్ చేశారు.

ముందుగా డిసైడ్ చేసిన రీతిలోనే ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా వెళ్లి ప్ర‌చారం చేస్తూ.. తాము మ‌ద్ద‌తు ఇస్తున్న సంఘం గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్ టీయూసీ.. ఏఐటీయూసీ.. టీఎన్ టీయూసీలు జ‌ట్టుగా పోటీ చేస్తున్నా.. వారి ఓట‌మి ప‌క్కా అని న‌మ్మ‌కం చెబుతున్నారు క‌విత‌. సింహం ఎప్పుడూ సింగిల్ గానే వ‌స్తుంద‌ని.. సింగ‌రేణి ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌న్నారు.

జాతీయ సంఘాలు.. వాటి అనుబంధ పార్టీల‌కు ఎంపీలు ఉన్నా ఎప్పుడూ సింగ‌రేణి స‌మ‌స్య మీద లోక్ స‌భ‌లో ఎప్పుడూ మాట్లాడ‌లేద‌ని.. కానీ తాను.. ఎంపీ బాల్క సుమన్ ఇద్ద‌రం మాట్లాడామ‌న్నారు. సంస్థ ఉద్యోగుల స‌మ‌స్య‌ల్ని తీర్చేందుకు కేసీఆర్ నడుంబిగించార‌ని.. సింగ‌రేణి విస్త‌ర‌ణ‌కు.. పెద్ద ఎత్తున ఉపాధి క‌ల్ప‌న‌కు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పారు. వార‌స‌త్వ ఉద్యోగాల‌పై టీఆర్ ఎస్ స‌ర్కారు చిత్త‌శుద్ధితో ఉంద‌ని.. ఈ విష‌యం కోర్టులో ఉన్నందున దాన్ని ఎలాగైనా సాధిస్తామ‌న్నారు. కార్మికుల ప‌రిహారాన్ని త‌మ ప్ర‌భుత్వం రూ.6 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంచింద‌న్నారు.

సింహం సింగిల్ గానే వ‌స్తుంద‌ని చెబుతూ.. త‌మ విజ‌యం ప‌క్కా అని ధీమా చెబుతున్న క‌విత‌.. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం భారీ ఎత్తున పార్టీ నేత‌ల్ని.. క్యాడ‌ర్‌ ను సింగ‌రేణిలో మొహ‌రించ‌టం చూస్తే.. క‌విత అండ్ కో మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య అంత‌రం ఎంత‌న్న విష‌యం ఇట్టే తెలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.