Begin typing your search above and press return to search.

ఇప్పుడు కూడా ఆంధ్రా అనుడేంటి కవితక్క?

By:  Tupaki Desk   |   18 Jun 2016 4:52 AM GMT
ఇప్పుడు కూడా ఆంధ్రా అనుడేంటి కవితక్క?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత మాటల తీవ్రత ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆమె మాటలు సూటిగా.. వాడిగా.. వేడిగా ఉంటాయి. చురుకు పుట్టేలా ఉండే ఆమె మాటలు రాజకీయ ప్రత్యర్థులకు శూలాల్లా తాకుతుంటాయి. ఇటీవల కాలంలో తెలంగాణ అధికారపక్షంపై కాంగ్రెస్ అధిష్ఠాన నేత డిగ్గీ రాజాతో సహా.. పలువురు తెలంగాణ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కవిత గళం విప్పారు.

తమ పార్టీ గురించి.. పార్టీలోని నేతల గురించి గొప్పలు చెప్పుకున్న ఆమె.. ఆంధ్రా నాయకులు అంటూ ‘ఆంధ్రా’ మీద తనకున్న ఆగ్రహాన్ని మాటల్లో ప్రదర్శించారు. కమీషన్ల కక్కుర్తి పడే చరిత్ర కాంగ్రెస్ దేనని.. టీఆర్ ఎస్ లో అలాంటి నేతలు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కాంట్రాక్టర్లకు టికెట్ లు అమ్ముకోవటం.. అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ లే పనిగా పెట్టుకున్నారన్నారు. మరి.. ఇన్ని అవలక్షణాలున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్ని టీఆర్ఎస్ లో ఎందుకు చేర్చుకుంటున్నట్లు?

చెడ్డ పార్టీ అని చెబుతున్న కవితక్క.. మరి.. అదే పార్టీలో దశాబ్దాల తరబడి ఉన్న నేతలకు ఘనస్వాగతం పలుకటంలో అర్థం ఏమిటి? ఇవన్నీ ఒకటైతే.. ఆంధ్రా ప్రాంతం మీదా తనకున్న వ్యతిరేకతను మరోసారి వ్యక్తం చేసిన కవిత.. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటానికి సహకరించకుండా ఆంధ్రా నాయకులకు అమ్ముడుపోయిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ నేతలదే అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మాటలో నిజాన్ని చూస్తే.. ఒకవేళ అలానే అమ్ముడు పోయి ఉంటే తెలంగాణ ఏర్పాటు కాకూడదు కదా? కానీ.. తెలంగాణ ఎందుకు ఏర్పడింది? సరే.. కవిత చెప్పినట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్రాప్రాంత నేతలకు అమ్ముడుబోయారనేదే నిజమైతే.. మరి.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతల్ని ఈ రోజున పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నట్లు? ఉద్యమ ద్రోహులుగా చెప్పుకునే పార్టీకి చెందిన నేతలకు స్వాగతం పలుకుతూనే.. మరోవైపు ఆంధ్రాప్రాంతం మీద తన అక్కసును వెళ్లగక్కటంలో అర్థం ఉందా? విడిపోయి కలిసి ఉందామంటూ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలే కవితక్కకు గుర్తు ఉండి ఉంటే.. ఆంధ్రా ప్రాంతం మీదా.. అక్కడి నేతల మీద ఆమె విరుచుకుపడటం ఆపేవారేమో..?