Begin typing your search above and press return to search.

బాబును తిట్టడం వెనుక లెక్కలు వేరేనంటున్న కవిత

By:  Tupaki Desk   |   23 Nov 2018 5:24 PM GMT
బాబును తిట్టడం వెనుక లెక్కలు వేరేనంటున్న కవిత
X
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీ నేతలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ అధినేత కేసీఆర్‌ నుంచి మొదలుకొని ద్వితీయ శ్రేణి లీడర్ల వరకు చంద్రబాబు తీరుపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా విమర్శల పేరుతో గులాబీ నేతలు టీడీపీపై విరుచుకుపడటం ఎందుకనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. దీనికి తాజాగా ఎంపీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో ఆమె మాట్లాడుతూ టీఆరెస్‌ చాలా స్పష్టమైన మెజారిటీతో గెలువబోతుందన్నారు. ప్రజాకూటమికి మీడియాలో చంద్రబాబు నాయుడు అతి ప్రచారం కల్పించారే తప్ప దాన్నుంచి గట్టిపోటీ అంటూ ఏమీ లేదని ఆమె కొట్టిపారేశారు.

ఎన్నికల్లో ‘టైట్‌ ఫైట్‌’ కనిపిస్తోందని - టీఆర్‌ ఎస్‌ పార్టీకి గెలుపుపట్ల మొదట్లో వుండిన విశ్వాసం ఇప్పటికీ ఉందా అనే ప్రశ్నకు కవిత విశ్లేషణాత్మక జవాబు ఇచ్చారు. మొదటికీ - ఇప్పటికీ పెద్దగా జరిగిందేమీ లేదన్నారు. మీడియా మేనేజ్‌ మెంట్‌ లో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు కాబట్టి ఏదో తీవ్రమైన పోటీ ఉన్నట్టు ఆయన అతి ప్రచారం సృష్టించారని తెలిపారు. టీడీపీవి లేనిపోని ఆశలని - క్షేత్రస్థాయిలో నిజానికి ఆ పార్టీకి కాని - కూటమికి కాని అంత సీన్‌ లేదని ఆమె కొట్టిపారేశారు. చాలా స్పష్టమైన మెజారిటీతో తాము తిరిగి అధికారంలోకి వస్తామన్నారు.

గట్టి పోటీ లేనపుడు టీఆర్‌ ఎస్‌ నాయకులు తెలంగాణ సెంటిమెంటును ఎందుకు రెచ్చగొడుతున్నారు...పూర్తిగా ప్రభుత్వ పథకాలు - అభివృద్ధి కార్యక్రమాల పైనే ఆధారపడి ప్రచారం చేయవచ్చు కదా? అని ప్రశ్నించగా - ‘ఇది సెంటిమెంటు కాదు. గత 60 ఏళ్లుగా తెలంగాణ పడ్డ వేదనను ప్రజల ముందుంచుతున్నాం. చంద్రబాబు తెలంగాణకు చేసిందేమీ లేదు. పైగా, ఆయన మౌలికంగానే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం. అటువంటి బాబుకు ఇక్కడేం పని? మా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతాడు? దీనినే మేం ప్రధానంగా ప్రజలకు వివరిస్తున్నాం. మళ్లీ ఆ వ్యక్తి బారిన పడకుండా మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవలసిన బాధ్యత మాపై ఉంది కదా’ అని వివరించారు.

‘గడువు పూర్తికాక ముందే ఎన్నికలకు వచ్చి తప్పు చేశామే’ అని ఎప్పుడైనా అనిపించిందా? అనే ప్రశ్నకు ‘గడువుకు ముందే ఎన్నికలకు పోవడమన్నది ఒక అద్భుత రాజకీయ ఎత్తుగడ. దీనివల్ల ఇప్పుడు చర్చకు వస్తున్నది కేవలం తెలంగాణ అంశమొక్కటే. అదే, సాధారణ ఎన్నికలతో పాటే ఇక్కడ ఎన్నికలు జరిగితే వంద విషయాలు చర్చకు వచ్చేవి. కాంగ్రెస్‌ మసీదు అంటే - బీజేపీ రామమందిర్‌ అనొచ్చు. తెలంగాణ విషయాన్నెవరూ పట్టించుకోరు. మేం ఈ నాలుగేండ్లలో చేసిన ప్రగతి ఆధారంగా ప్రజల్ని ఓట్లు అడిగే అవకాశమే ఉండేది కాదు. అదే, ఇప్పుడు ఎన్నికలు రావడం వల్ల కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యమైనాయి. దీంతో ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కోరేవారు - ఎవరు కారన్నది తేలిపోతుంది.’ అని అన్నారు.