Begin typing your search above and press return to search.

సొంత అడ్డాలో కవితకు చేదు అనుభవం

By:  Tupaki Desk   |   11 April 2019 10:35 AM GMT
సొంత అడ్డాలో కవితకు చేదు అనుభవం
X
ఆమె స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తె. అంతకు మించి నిజామాబాద్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆమె సొంత అడ్డా లాంటి సొంత నియోజకవర్గంలో కవితకు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ముచ్చటగా మూడు నెలలు అయ్యాయి అంతే. కానీ.. అంతలో అంత వ్యతిరేకత? అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం నిజామాబాద్ టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కవితకు ఊహించిన రీతిలో షాకింగ్ పరిణామం ఎదురైంది. తాజాగా ఆమె నవిపేట్ మండలం పోతంగల్ లో ఓటు వేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ఉద్దేశించి అక్కడకు ఓటు వేయటానికి వచ్చిన స్థానిక మహిళలు ఆమెను ప్రశ్నలతో కడిగేసినంత పని చేశారు.

ఐదేళ్లలో తమకు ఎలాంటి సంక్షేమం జరగలేదని.. , అభివృద్ధి ఫలాలు అందలేదని వారు వాపోయారు. కవితతో మాట్లాడుతున్నట్లుగా మహిళలు ముందుకు రావటం.. ఆసక్తిగా వారి వద్దకు వెళ్లిన కవితకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

ఊహించని రీతిలో ఒక్కరు మొదలెట్టిన సమస్యల నిలదీత.. అంతకంతకూ పెరగటంతో ఆమె సెక్యురిటీకి కూడా సీన్ అర్థమైంది. ప్రశ్నిస్తున్న వారిని సర్దిచెబుతూ.. వారి నుంచి ఆమెను ముందుకు కదలించేశారు. పరిస్థితి తనకు అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించిన కవిత.. వారి నుంచి బయట పడే ప్రయత్నం చేసినట్లుగా చెప్పాలి.

ఇదిలా ఉండగా.. తనను ప్రశ్నిస్తున్న మహిళల్ని.. ఓట్లు వేయాలని కోరుతూ వెళ్లిపోయారు. ఏమైనా.. కారు.. సారు.. పదహారు నినాదంతో గులాబీ కారు దూసుకెళుతుందనుకుంటే.. అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకోవటం కవితను ఇబ్బంది పెట్టిందని చెప్పక తప్పదు.