Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ కు వంద‌సీట్లు..ప‌వ‌న్‌ పై క‌విత విశ్లేష‌ణ ఇదే

By:  Tupaki Desk   |   30 Jan 2018 3:03 PM GMT
టీఆర్ ఎస్‌ కు వంద‌సీట్లు..ప‌వ‌న్‌ పై క‌విత విశ్లేష‌ణ ఇదే
X
రాబోయే ఎన్నిక‌ల‌పై తెలంగాణ‌ సీఎం కేసీఆర్ త‌న‌య, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్‌ఎస్ 100 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని ఎంపీ కవిత తెలిపారు. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందన్నారు.

ఈసారి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే మహిళలకు అవకాశం ఇవ్వాలని తాను ముఖ్యమంత్రిని అడుగుతానని చెప్పారు. స‌చివాయంలోఇవాళ ఎంపీ కవిత మీడియాతో చిట్‌ చాట్‌ లో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేసినట్లు కవిత పేర్కొన్నారు. మరికొన్ని నూతన కార్యక్రమాలు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు.

రాష్ర్టానికి చెందిన ఒక్కరికైనా పద్మ అవార్డులు రాకపోవడం బాధాకరమని ఎంపీ క‌విత వ్యాఖ్యానించారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని అడిగామ‌ని తెలిపారు. కేంద్రం రాష్ర్టానికి చేయాల్సింది చాలా ఉందని పార్లమెంట్ వేదికగా తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. పసుపు బోర్డు విషయమై కేంద్రంలో కదలిక తీసుకొచ్చామ‌ని తెలిపారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల ముసాయిదాను ఏజీ కూడా ఆమోదించారని, విధాన రూపకల్పన తర్వాత సీఎం సింగరేణి యాత్ర ఉంటుందని కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ నిర్ణయిస్తుందని ఎంపీ క‌విత‌ చెప్పారు. కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరనేది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. మంత్రి హరీష్ రావు ఎంపీగా పోటీ చేస్తారనే అంశంపై తాను స్పందించనని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా పోటీ చేయాలా అనే విషయం పార్టీ నిర్ణయిస్తుందని వివ‌రించారు.

పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ క‌విత‌ వెల్లడించారు. వలసల వల్ల వచ్చే ఎన్నికల్లో మాకెలాంటి ఇబ్బంది లేదని స్ప‌ష్టం చేశారు. కోదండరాం రాజకీయ పార్టీ పెడితే స్వాగతిస్తామన్నారు. విపక్షాలన్నీ ఒక్కటయితే తమకే మంచిదని, అప్పుడు వార్ వన్ సైడ్ అవుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉందని, ఆయన భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.