Begin typing your search above and press return to search.

కామ్రేడ్లకు భారీ షాకిచ్చిన కవిత

By:  Tupaki Desk   |   2 May 2016 6:14 AM GMT
కామ్రేడ్లకు భారీ షాకిచ్చిన కవిత
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీలోని వారు చెప్పే మాటలకు ఎవరైనా సరే ఫ్లాటు కావాల్సిందే. తియ్యతియ్యగా మాటలు చెప్పటంలో వారి తర్వాతే ఎవరైనా. వారి మాటలు ఎంత తియ్యగా ఉంటాయో.. తమ రాజకీయ ప్రత్యర్థులపై చేసే వ్యాఖ్యలు అంతే ఘాటుగా ఉంటాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టులను ఏదైనా మాట అనటానికి రాజకీయ పార్టీ అధినేతలు తొందరపడరు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కమ్యూనిస్టులను తోక పార్టీలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు.. ఆ తర్వాత వారిని ఆ స్థాయిలో మాట అన్న వారు ఎవరూ లేరనే చెప్పాలి.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు వింటే కమ్యూనిస్టుల నోట మాట రాదంతే. కమ్యూనిస్టుల మూలాల్ని టచ్ చేయటమే కాదు.. వారి నోట వెంట మాట రాకుండా చేసేలా కవిత తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. పోరాటానికి.. ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే.. తన తండ్రి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత గొప్పొడన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

కమ్యూనిస్టులు అంతా విప్లవం రావాలని అంటారని.. కానీ విప్లవాన్ని తీసుకొచ్చి చూపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆమె చెప్పుకొచ్చారు. విప్లవం రావాలంటూ కమ్యూనిస్టులు పోరాటం చేస్తే.. వారి కంటే మిన్నగా ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణను సాధించారని.. కేసీఆర్ కంటే మిన్నగా పోరాటం చేసే వారు ఎవరుంటారని కవిత ప్రశ్నిస్తున్నారు. విప్లవంతో తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్న నేపథ్యంలో.. కమ్యూనిస్టుల అవసరంలేదని కవిత స్పష్టం చేయటం గమనార్హం. విప్లవం.. పోరాటం.. అంటూ మాటలు చెప్పి బండి నడిపించే కమ్యూనిస్టులకు కవితక్క మాటల ఫార్మాట్ నోట మాట రాకుండా చేస్తుందనటంలో సందేహం లేదు.