Begin typing your search above and press return to search.

దత్తన్నను కవితక్క అంత మాట అనేశారా?

By:  Tupaki Desk   |   18 Jan 2016 2:48 PM IST
దత్తన్నను కవితక్క అంత మాట అనేశారా?
X
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ స్కాలర్ 28 ఏళ్ల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనం సృష్టించటంతో పాటు.. వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈ వ్యవహారానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు.. పలువురు బీజేపీ నేతల హస్తం ఉందంటూ కొన్ని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై తెలంగాణ రాష్ట అధికారపక్ష ఎంపీ కవిత బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హస్తం ఉందంటూ విద్యార్థులు చేసే ఆరోపణలకు బలం చేకూరేలా కవిత వ్యాఖ్యలు చేయటం గమనార్హం. విద్యార్థుల రాజకీయాల్లోకి బండారు దత్తాత్రేయ తలదూర్చారంటూ విమర్శించారు. విద్యార్థుల వివాదాల్లోకి రాజకీయ నాయకులు తలదూర్చటం మంచింది దని.. అందుకే తాము ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్నామన్నారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బీజేపీ విద్యార్థి విభాగానికి అనుకూలంగా పని చేసి.. దళిత విద్యార్థులకు వ్యతిరేకంగా వీసీపై ఒత్తిడి తెచ్చేలా లేఖ రాశారని.. ఆ లేఖే విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమైందని కవిత ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆకారణంగా విద్యార్థులపై వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కవిత డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో టీఆర్ ఎస్ నేతలు సన్నిహితంగా వ్యవహరిస్తుంటారు. ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ అధినేత కుమార్తె.. తనను టార్గెట్ చేయటంపై దత్తాత్రేయ ఎలా రియాక్ట్ అవుతారో..?