Begin typing your search above and press return to search.

తొలిసారి ప‌రిధి చెప్పి మ‌రీ ఆన్స‌ర్ చేసిన క‌విత‌

By:  Tupaki Desk   |   25 Sep 2018 11:30 AM GMT
తొలిసారి ప‌రిధి చెప్పి మ‌రీ ఆన్స‌ర్ చేసిన క‌విత‌
X
క్వ‌శ్చ‌న్ ఏదైనా స‌రే.. ఠ‌క్కుమ‌ని చెప్పే అతి కొద్ది తెలుగు నేత‌ల్లో ఎంపీ క‌విత ఒక‌రు. చాలామంది క్వ‌శ్చ‌న్ల‌కు ఆన్స‌ర్ చెబుతారు. కానీ.. క‌విత త‌ర‌హా వేరు. ఆమె ఎలాంటి ప్ర‌శ్నకైనా స‌మాధానం చెబుతారు. ఆ ఆన్స‌ర్ లో సంబంధం లేని అంశాలు ఉండ‌టం.. ప్ర‌శ్న‌కు సూట్ కాని విష‌యాలు చెప్ప‌టం లాంటివి అస్స‌లు చేయ‌రు.

అంతేకాదు.. టీఆర్ ఎస్ పార్టీ వ‌ర‌కూ త‌న ప‌రిధి ఇంతేన‌ని గిరి గీసుకున్న‌ట్లుగా ఏమీ ఉండ‌రు. అవ‌స‌ర‌మైతే ప్ర‌ధాని మోడీ మొద‌లు ఎవ‌రినైనా స‌రే విమ‌ర్శ‌ల‌తో ఉతికి ఆరేసే అల‌వాటు ఉందో.. పార్టీకి సంబంధించిన అంశాల మీదా అంతే క‌మాండ్ తో మాట్లాడుతుంటారు.

అలాంటి ఆమె తొలిసారి ఒక ప్ర‌శ్న విష‌యంలో మాత్రం అది త‌న ప‌రిధిలోనిది కాదంటూ మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. క‌విత ఎవ‌రు? టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె. ఆమె రాజ‌కీయ ప‌రిణితి.. ఆమె సామ‌ర్థ్యం ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో బ‌య‌ట ప‌డ‌ట‌మే కాదు.. తండ్రికి ఏ మాత్రం తీసిపోని కుమార్తెగా పేరు తెచ్చుకున్నారు.

అలాంటి ఆమె.. తొలిసారి పార్టీకి సంబంధించిన విష‌యంపై ఆచితూచి అన్న‌ట్లు మాట్లాడ‌ట‌మే కాదు.. ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెన‌క్కి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఇంత‌కీ ప‌రిధి గురించి ప్ర‌స్తావించిన ప్ర‌శ్న ఏమిటి? దానికి క‌విత చెప్పిన ఆన్స‌ర్ ఏమిటి? అన్న‌ది చూస్తే..

టీఆర్ ఎస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవ‌టానికి ఆస‌క్తితో ఉన్నా.. ప్ర‌ధాని మోడీ అలా కాకుండా చేస్తున్నారంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించాల‌ని క‌విత‌ను అడిగిన‌ప్పుడు.. ఆమె కాస్త త‌గ్గారు. తొంద‌ర‌ప‌డి ఏం మాట్లాడితే ఏం జ‌రుగుతుంద‌న్న భావ‌న ఆమె మాట‌ల్లో క‌నిపించ‌క మాన‌దు.అందుకు త‌గ్గ‌ట్లే.. ఆమె నోటి నుంచి ఎప్పుడూ లేని రీతిలో ఆ అంశం త‌న ప‌రిధిలోనిది కాద‌ని చెబుతూనే.. టీఆర్ ఎస్ తో పొత్తుకోసం చంద్ర‌బాబు - టీడీపీ ఎప్పుడు ప్ర‌య‌త్నించారో త‌న‌కు తెలీద‌ని.. టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు ఎవ‌రో ఆపితే.. వ‌ద్దంటే అమాయ‌కంగా చంద్ర‌బాబు వెళ్లి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటార‌ని తాను అనుకోవ‌టం లేద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారంటే ఏదో పొలిటిక‌ల్ గేమ్ ఉంద‌ని అర్థ‌మ‌ని.. కాకుంటే ప్ర‌జ‌లు మాత్రం ఆంధ్రా పార్టీ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవ‌టం స‌రికాదంటున్నార‌ని వ్యాఖ్యానించారు. మ‌రి.. ఇదే ఆంధ్రా పార్టీతో అంత పెద్ద తెలంగాణ ఉద్య‌మం జ‌రుగుతున్న‌ప్పుడు పొత్తు పెట్టుకున్న‌ది ఎందుకో?