Begin typing your search above and press return to search.

కవిత బినామీ అంటూ ఈడీ వేసిన 17 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏముంది?

By:  Tupaki Desk   |   8 March 2023 10:05 AM GMT
కవిత బినామీ అంటూ ఈడీ వేసిన 17 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏముంది?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత మెడకు చుట్టుకునేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అన్న సందేహాన్ని కలిగించేలా పరిస్థితులు ఉన్నాయి. విపక్షాల గొంతు నొక్కేందుకు వీలుగా కేంద్ర ఏజెన్సీలను ప్రయోగిస్తున్నారంటూ కేసీఆర్ తో సహా పలువురు విపక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన 24 గంటల వ్యవధిలోనే కీలక పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను రెండు రోజుల పాటు విచారించిన ఈడీ..తాజాగా ఆయన్ను అరెస్టు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు పలుమార్లు ప్రస్తావించటం గమనార్హం. అన్నింటికంటే కీలక అంశం.. ఎమ్మెల్సీ కవితకు తాను.. ప్రేమ్ రాహుల్ ఇద్దరం బినామీలు అంటూ ఈడీ విచారణలో అరుణ్ రామచంద్ర పిళ్లై ఒప్పుకోవటం గులాబీ అధినేత కుమార్తెకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది.

తాము ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాల్ని కాపాడేందుకు వీలుగా వ్యాపారంలో భాగస్వామిని అయినట్లుగా పిళ్లై పేర్కొన్నట్లుగా ఈడీ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్ లో 32.5 శాతం మేర భాగస్వామిగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ స్కాంలో పిళ్లై కీలక పాత్రధాని అని పేర్కొంటూ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించిన ఏడురోజులకు అనుమతి వచ్చింది. అరుణ్ పిళ్లైని ప్రత్యేక కోర్టులో ప్రవేశ పెడుతూ ఈడీ సమర్పించిన 17పేజీల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించటం గమనార్హం.

17 పేజీల్ రిమాండ్ రిపోర్టులోని ముఖ్యాంశాలు ఏమంటే..?

- మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు, పలు రిటైల్‌ జోన్ల మధ్య కార్టెల్‌ ఏర్పాటు చేయడంలో పిళ్లై కీలకపాత్ర పోషించారు.
- సౌత్ గ్రూపులో ఉన్న వారు ఎవరంటే.. అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తదితరులు.
- సౌత్‌ గ్రూప్‌కు అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నా... కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారు. ప్రేమ్‌రాహుల్‌కు 32.5శాతం వాటా, ఇండోస్పిరిట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌కు 35శాతం వాటా ఉంది.
- కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి తరఫున బినామీలుగా అరుణ్‌ పిళ్లై, ప్రేమ్‌ రాహుల్‌ ఇద్దరూ పెట్టుబడులు పెట్టినట్లుగా విచారణలో వెల్లడించారు. అభిషేక్‌, బుచ్చిబాబుతో కలిసి పిళ్లై ఢిల్లీలో 30 శాతం మద్యం వ్యాపారాన్ని కంట్రోల్ చేశారు. ఇండో స్పిరిట్స్‌లో పిళ్లై రూ.3.40 కోట్లు అధికారికంగా పెట్టుబడులు పెట్టి.. కవిత ఆదేశాల మేరకు అందులో కోటి రూపాయిల్ని తిరిగి చెల్లించారు.
- సౌత్‌గ్రూ్‌ప, ఆప్‌, విజయ్‌ నాయర్లకు ముడుపులు ఇచ్చిన కారణంగానే ఇండో స్పిరిట్స్ పెర్నాడ్ రికార్డులో హోల్ సేలర్ గా నియమించారు. 9 రిటైల్‌ జోన్లను నియంత్రించిన కార్టెల్‌ ఏర్పాటులో పిళ్లై కీలక పాత్ర పోషించారు. సౌత్‌ గ్రూప్‌ చెల్లించిన ముడుపులను వ్యాపార కార్యకలాపాల పేరుతో తిరిగి పొందేందుకే ఈ కార్టెల్‌ ఏర్పడింది.
- కార్టెల్ ఏర్పాటులో భాగంగా పలు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. వీటిల్లో అభిషేక్‌, బుచ్చిబాబు, విజయ్‌ నాయర్‌, సమీర్‌ మహేంద్రు, శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు.

2021లో ఏం జరిగింది?

- 2021 జూన్‌లో సమీర్‌ మహేంద్రును కలుసుకునేందుకు శరత్‌రెడ్డికి చెందిన చార్టర్డ్‌ విమానంలో అభిషేక్‌, బుచ్చిబాబు తదితరులు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వచ్చారు. 2021 సెప్టెంబరులో పెర్నార్డ్‌ రికార్డ్‌ ఏర్పాటు చేసిన విందులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, పిళ్లై, బుచ్చిబాబు, శరత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇండో స్పిరిట్స్‌లో పెట్టుబడులు పెట్టే అంశంతో పాటు రిటైల్‌ జోన్ల గురించి చర్చించారు.
- హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ లో విజయ్‌ నాయర్‌, పిళ్లై, అభిషేక్‌, దినేష్‌ అరోరా తదితరులు కలుసుకున్నారు. ఆ తర్వాతే రూ.31 కోట్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాన్సఫర్ అయ్యాయి.

ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంత వాటా అంటే?

- ఢిల్లీలో ఏటా మద్యం వ్యాపారం రూ.4-5 వేల కోట్ల మధ్య జరిగితే అందులో రూ.3500 కోట్లు ఎల్‌1 హోల్‌సేలర్లకే లభిస్తుంది. ఇందులో 12 శాతం అంటే రూ.420 కోట్లు లాభాలు వస్తాయి. అందులో సగం రూ.210 కోట్లు ఆప్ నకు ముడుపులుగా చెల్లించాలి.
- ఆప్‌ తరఫున రంగంలోకి దిగిన విజయ్‌ నాయర్‌కు సౌత్‌ గ్రూప్‌ రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చింది. ఆ సొమ్మును ఎలా తిరిగి పొందాలనే విషయంపై 2022 ఏప్రిల్‌లో పిళ్లై తదితరులు ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో విజయ్‌ నాయర్‌తో సమావేశం అయ్యారు.
- పిళ్లై ఆదేశాలతో ఇండో స్పిరిట్స్‌ మూడు సంస్థలకు రూ.4.35 కోట్ల మేరకు క్రెడిట్‌ నోట్లు జారీ చేశారు. ఆ తర్వాత దర్యాప్తును దారి మళ్లించేందుకు వాటిని రివర్స్‌ చేసినట్లు పుస్తకాల్లో నమోదు చేశారు. మద్యం కుంభకోణంలో పిళ్లై మొదటి నుంచి భాగస్వామిగా ఉన్నారు.
- కొత్త ఎక్సైజ్‌ విధానం ద్వారా లభించే వ్యాపార అవకాశాలను చర్చించేందుకు, భాగస్వామ్యం ఏర్పర్చుకునేందుకు పిళ్లై.. విజయ్‌ నాయర్‌, సమీర్‌ మహేంద్రుతో సంబంధాలు పెట్టుకున్నారు. ఢిల్లీ రాష్ట్ర కేబినెట్ లో చర్చకు ముందే మంత్రుల బృందం నివేదికలో కొన్ని భాగాలు బుచ్చిబాబు, పిళ్లై వద్ద ఉన్నాయి. ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించి.. రూ.296.2 కోట్లు సంపాదించారు. ఆ సొమ్ముతో పిళ్లై స్థిరాస్తులతో పాటు పలు చరాస్తులు కొనుగోలు చేశారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.