Begin typing your search above and press return to search.

కవిత సంచలనం.. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. బెదిరిస్తోంది

By:  Tupaki Desk   |   15 March 2023 6:17 PM GMT
కవిత సంచలనం.. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. బెదిరిస్తోంది
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ తన విచారణను వేగవంతం చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని ఒక్కొక్కరిగా అరెస్టు చేయటం.. కొత్త వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వటం.. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరు కావటం తెలిసిందే.

గురువారం మరోసారి విచారణకు హాజరు కావాల్సిన కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించి.. ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరటం తెలిసిందే. దీనికి స్పందించిన అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు నో చెప్పింది. అదే సమయంలో.. కవిత పిటిషన్ పై ఈ నెల 24న విచారణ చేపట్టనున్నట్లుగా పేర్కొంది. అయితే.. సుప్రీంను ఆశ్రయించిన సందర్భంగా కవిత దాఖలు చేసిన పిటిషన్ లో పలు అంశాల్ని ప్రస్తావించారు.

అన్నింటికి మించి ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఆదేశాలతో ఈడీ తనను వేధిస్తోందని.. తన విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లుగా పేర్కొన్నారు. లిక్కర్ కేసులో తన పేరు ఎక్కడా లేదని.. కొంతమంది వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని తనను ఇరికించారన్నారు. తనకు వచ్చిన స్టేట్ మెంట్లలో విశ్వసనీయ లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. విచారణ సందర్భంగా ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందని సంచలన ఆరోపణ చేశారు.

తన ఆరోపణకు ఉదాహరణగా.. చందన్ రెడ్డిని ఈడీ అధికారులు కొట్టటాన్ని ప్రస్తావించారు. అరుణ్ రామచంద్ర పిళ్లైను బెదిరించి.. వాంగ్మూలాన్ని తీసుకున్నారన్నారు. అందుకే.. ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. తన ఫోన్ ను ఈడీ అధికారులు బలవంతంగా తీసుకున్నారని.. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ను సీజ్ చేశారన్నారు. తన ఫోన్ సీజ్ చేసే సమయంలోనూ వివరణ తీసుకోలేదన్నారు. ఇంతవరకు ఎప్పుడూ లేని రీతిలో ఈడీ మీద కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో సదరు సంస్థ ఏరీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.