Begin typing your search above and press return to search.

‘బతుకమ్మ’ కవిత స్టాంప్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   20 Dec 2016 7:13 AM GMT
‘బతుకమ్మ’ కవిత స్టాంప్ వచ్చేసింది
X
కాన్సెప్ట్ ని ఎంచుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ కాన్సెప్ట్ మొత్తానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో వారికి వారే సాటి అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన దశాబ్దాల పాటు సాగినా.. ఉద్యమంలోని కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతలా మార్పు వచ్చిందన్నది తెలిసిందే. చివరకు అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది కూడా.

ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే.. కేసీఆర్ మాత్రమే కనిపించే పరిస్థితి. ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నా.. వారిని ఒక చోటికి చేర్చి.. అనుకున్న లక్ష్యానికి చేరుకున్న ఘనత మాత్రం కేసీఆర్ కే చెల్లుతుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జాగృతి పేరిట సంస్థను ఏర్పాటు చేయటమే కాదు.. తెలంగాణ సంస్కృతిని.. సంప్రదాయాల్ని పరిరక్షించే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి బతుకమ్మకు కొంగొత్త ఇమేజ్ తీసుకొచ్చిన క్రెడిట్ కేసీఆర్ కుమార్తె కవితకు దక్కుతుంది.

ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ ని ఒక స్థాయికి తీసుకెళ్లటం.. దాన్ని విడిచి పెట్టకుండా.. అంతకంతకూ పెంచుకుంటూ పోవటం కేసీఆర్ ఫ్యామిలీకి అలవాటే. దాన్నే ఎంపీ కవిత కొనసాగించారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి దేశంలోనూ బతుకమ్మ ఉత్సావాల్ని నిర్వహించటం ద్వారా.. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా కవిత ఆవిర్భవించారని చెప్పాలి.

ఈ ఏడాది బతుకమ్మ ఉత్సావాల్ని పూర్తిగా విదేశాల్లో నిర్వహించిన ఆమె.. పనిలో పనిగా బతుకమ్మ గొప్పతనాన్ని చాటేందుకు.. ఈ సంప్రదాయాన్ని మరింత పాపులరైజ్ చేసే ప్రయత్నం మీద ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ లలో బతుకమ్మస్టాంపులు విడుదలయ్యే ఏర్పాట్లు చేయగలిగారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయా దేశాల్లో విడుదల చేసిన బతుకమ్మ స్టాంపుల్లో బతుకమ్మను ఎత్తుకున్న కవిత ఫోటోను పబ్లిష్ చేయటం.. బతుకమ్మ శుభాకాంక్షలతో అన్న స్టాంప్ ను తీసుకొచ్చేలా చేయగలిగారు. స్వదేశంలోనూ.. విదేశంలోనూ బతుకమ్మ అన్న వెంటనే కవిత గుర్తుకు వచ్చేలా చేస్తున్నారటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/