Begin typing your search above and press return to search.

కావేరీ చేసిన నష్టం రూ.25వేల కోట్లట

By:  Tupaki Desk   |   14 Sep 2016 3:03 AM GMT
కావేరీ చేసిన నష్టం రూ.25వేల కోట్లట
X
తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల మధ్య రగిలిన కావేరీ జలాల వివాదంతో జరిగిన నష్టం ఎంతో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. రెండురాష్ట్రాల నడుమ రగిలిన జలవివాదం కారణంగా రూ.25వేల కోట్ల నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. జలవివాదానికి మరింత హీట్ పెంచేలా అల్లరి మూకలు చెలరేగిపోవటంలో ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజా జీవనం స్థంభించింది. దీంతో.. ఈ భారీ నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. హింసాత్మక కార్యక్రమాల కారణంగా బెంగళూరు వ్యాపార.. పరిశ్రమ వర్గాలకు కోలుకోలేనంత నష్టం వాటిల్లిందని.. ఫార్చ్యూన్ 500 కంపెనీలన్నీ దాదాపు బెంగళూరులోనే ఉన్నాయని.. తాజాగా జరిగిన గొడవల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గార్డెన్ సిటీకి ఉన్న పేరు ప్రఖ్యాతులన్నీ కావేరీ పాలయ్యాయని చెబుతున్నారు.

దెబ్బ తిన్నఇమేజ్ తిరిగి తెచ్చుకోవటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. రెండురాష్ట్రాల్లోనూ పరిస్థితిని చక్కదిద్దాలంటూ కేంద్రాన్ని అసోచామ్ కోరింది. తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో వ్యాపార.. పారిశ్రామిక వర్గాల నైతిక స్థైర్యం దారుణంగా దెబ్బ తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటీ ఎగుమతుల్లో చెన్నై.. బెంగళూరు నగరాలకు ఉన్న పేరు ప్రఖ్యాతలు నేపథ్యంలో ఇలాంటి గొడవలు రెండు రాష్ట్రాలకు ఏ మాత్రం మంచివి కావంటోంది అసోచామ్.

ఇదిలా ఉంటే.. రెండు రాష్ట్రాల మధ్య రగిలిన గొడవలకు కారణం ఎవరు? ఇంత తీవ్ర భావోద్వేగం ఎలా చోటు చేసుకుంది? ఈ పాపంలో ఎవరికెంత వాటా ఉందన్న విషయాన్ని సాపేక్షంగా చూస్తే.. రెండు రాష్ట్రాల్లోని ప్రజల మధ్య భావోద్వేగాలు తీవ్రస్థాయిలో పెరగటానికి కారణంగా ఆయా రాష్ట్రాల్లోని న్యూస్ ఛానళ్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటకలో కావేరి నిరసనకారుల్ని విమర్శించిన అంశంపై ఒక తమిళ విద్యార్థిని బెంగళూరులో చితకబాదిన వీడియో క్లిప్పింగ్ ను తమిళన న్యూస్ ఛానళ్లు వైరల్ చేయటం.. దీనికి ప్రతిగా తమిళనాడులోని కర్ణాటక ప్రాంతానికి చెందిన వారిదైన న్యూ ఉడ్ ల్యాండ్ హోటల్ పై పెట్రోల్ బాంబులను విసరటం.. ఈ ఘటనను లైవ్ కవరేజ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రసారం చేయటంతో భావోద్వేగాలు పీక్ స్టేజ్ కు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

మరింత దారుణమైన అంశం ఏమిటంటే.. రెండు రాష్ట్రాల్లోనిమీడియా సంస్థలు టీఆర్ పీ రేటింగ్ కోసం.. వార్తల్ని సంయమనంతో ప్రసారం చేయకుండా.. ఏ రాష్ట్రానికి చెందిన మీడియా సంస్థలు ఆ రాష్ట్రానికి వత్తాసు పలుకుతూ వార్తలు ప్రసారం చేయటంతో పరిస్థితి మరింత దిగజారిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్పీ రేటింగ్ మీద ఉన్న పిచ్చతో ఒకే సంస్థకు చెందిన తమిళ.. కన్నడ ఛానళ్లలో ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు తగ్గట్లుగా వార్తలు వండి వడ్డించారే కానీ.. నిజం ఏమిటి? ఎవరెలా ఉండాలన్న అంశంపై ఏ ఒక్క టీవీ ఛానల్ ప్రయత్నం చేయలేదన్న విమర్శ వినిపిస్తోంది. సున్నిత సమయాల్లో సంయమనం పాటించాల్సిన మీడియా తన బాధ్యతను మర్చిపోవటమే ఇంతటి భారీ విధ్వంసానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ జర్నలిస్టులు పలువురు రెండు రాష్ట్రాల్లో టీవీ చానళ్ల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపాటు వ్యక్తం కావటం గమనార్హం.