Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'కావలి' గడ్డపై నిలిచేదెవరో..?

By:  Tupaki Desk   |   7 April 2019 1:30 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్:  కావలి గడ్డపై నిలిచేదెవరో..?
X
అసెంబ్లీ నియోజకవర్గం : కావలి

వైసీపీ: రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి
టీడీపీ: విష్ణువర్దన్‌ రెడ్డి
జనసేన: పసుపులేటి సుధాకర్‌

ఆంధ్రరాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు జన్మించిన గడ్డ కావలి. వాణిజ్య పరంగానే ప్రాముఖ్యతను చాటుకున్న కావలి నియోజకవర్గంలో రాజకీయం వాడివేడిగా సాగుతుంటుంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న కావలి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లోనూ ఆయన వైసీపీ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీలో గత ఎన్నికల్లో ఓడిపోయిన మస్తాన్‌ రావును కాదని ఈసారి విష్ణువర్దన్‌ రెడ్డిని బరిలోకి దించింది. జనసేన నుంచి పసుపులేటి సుధాకర్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

* కావలి అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర:

మండలాలు: కావలి టౌన్‌ - కావలి రూరల్‌ - దగదర్తి - అల్లూరు - బోగోలు

ఓటర్లు: 2 లక్షల 46 వేలు

1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, గత ఎన్నికల్లో వైసీపీలు జెండా పాతాయి.

* రెండోసారి ప్రతాప్‌ రెడ్డి రాణిస్తాడా..?

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నుంచి వచ్చిన రామిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి 2011 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ సానుభూతితో పాటు ఇతర సమీకరణాలు కలిసి వచ్చి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలుపొందారు. ఈ ఐదేళ్లలో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తమ పార్టీ అధికారం లేకున్నా కొన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించారు. అయితే మత్య్యకారులకు ఫిషింగ్‌ హార్బర్‌ లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.

*అనుకూలతలు:

-నియోజకవర్గంలో పట్టు సాధించడం
-వ్యక్తిగతంగా సమస్యలు పరిష్కరించడం
-సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడం

* ప్రతికూలతలు

-తాగునీటి పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపకపోవడం
-ఏయిర్‌ పోర్టు ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చి పట్టించుకోకపోవడం

* విష్ణువర్దన్‌ రెడ్డి టీడీపీ జెండా ఎగురవేస్తారా..?

2014 ఎన్నికల్లో సీనియర్‌ టీడీపీ నేత మస్తాన్‌ రావు ఇక్కడ ఓటమి చెందారు. దీంతో ఆయన నెల్లూరు ఎంపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో టీడీపీ మరో సీనియర్‌ నేత విష్ణువర్దన్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించారు పార్టీ అధినేత బాబు. సంపన్న కుటుంబంలో పుట్టి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విష్ణువర్దన్‌ రెడ్డికి జిల్లాలో ప్రత్యేక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పటి వరకు అల్లూరు - కావలి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో ఆయనతోనే టీడీపీ జెండా ఎగురవేయొచ్చనే ఆలోచనతో టీడీపీ విష్ణుకు టికెట్‌ కేటాయించింది.

* అనుకూలతలు:

-జిల్లాపై పట్టున్న నేత
-గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం
-వైసీపీపై వస్తున్న వ్యతిరేకత

*ప్రతికూలతలు

-నియోజకవర్గంలో కేడర్‌ తక్కువగా ఉండడం
-గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడం

*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది?

జనసేన నుంచి పసుపులేటి సుధాకర్‌ పోటీ చేస్తున్నారు. అయితే టీడీపీ - వైసీపీల మధ్యే ప్రధాన పోరు కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. ఇక టీడీపీ అధికారంలో ఉండడంతో స్థానిక నేత బలంగా ఉన్నారు. ఇద్దరు రాజకీయ నేతల మధ్య సాగుతున్న ఈ పోరులో ఎవరు గెలిచానని ఆసక్తిగా మారింది.