Begin typing your search above and press return to search.

మధిరలో విషాదం : కమ్యూనిస్టు యోధుడు కట్టా వెంకటనర్సయ్య కన్నుమూత

By:  Tupaki Desk   |   2 Jan 2021 5:30 AM GMT
మధిరలో విషాదం : కమ్యూనిస్టు యోధుడు కట్టా వెంకటనర్సయ్య కన్నుమూత
X
ఎన్నో ఏళ్ళ పాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిన ఖమ్మం జిల్లాలో సీపీఎం ముఖ్య నాయకుడిగా, మధిర ఎమ్మెల్యేగా పనిచేసిన కట్టా వెంకటనర్సయ్య(87) తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కల్లూరు మండలంలోని తన స్వగ్రామమైన పోచారం లో శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు తెలిసి సీపీఎం సహా పలు పార్టీల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కట్టా వెంకటనర్సయ్య మధిర నుంచి సీపీఎం తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు ఎన్నికయ్యారు. పార్టీ తరఫున ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేశారు. 2009లో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పార్టీ విధి విధానాలు నచ్చక పోవడం, అగ్ర నేతల తీరు కూడా పడకపోవడంతో పార్టీ నుంచి వైదొలిగారు. ఎన్నికలకు ఇంకా నెల రోజులు ముందుగానే తన పదవీ కాలం ఉన్నప్పటికీ తన పదవికి రాజీనామా చేశారు.

తాను చనిపోయే దాకా కమ్యూనిస్టు గానే ఉంటానని ప్రకటించిన వెంకట నర్సయ్య పలు పార్టీలు ఆహ్వానం పలికినా సున్నితంగా తిరస్కరించారు. విద్యార్థి దశలోనే వివిధ ఉద్యమాల్లో పాలుపంచుకున్న ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు చేశారు. కట్టా వెంకటనర్సయ్య కు మధిర నియోజకవర్గం పై ఎంతో పట్టు ఉంది. కట్టా వెంకటనర్సయ్య రాజకీయాల్లో అరుదైన నేత అని ఎప్పుడూ ఎక్కడా రాజీ పడకుండా విలువలే ఆస్తిగా బతికారని పలువురు ఆయన తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరనిలోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.