Begin typing your search above and press return to search.

చంద్రబాబు చాణుక్యుడో..చేతకాని చవటో చెప్పండి?

By:  Tupaki Desk   |   22 Jun 2019 12:08 PM GMT
చంద్రబాబు చాణుక్యుడో..చేతకాని చవటో చెప్పండి?
X
ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సానుభూతి పరుడిగా మారిపోయారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే వైసీపీ స్టాండ్ తీసుకున్న ఆయన.. అప్పట్లో ఆచితూచి మాట్లాడేవారు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి కత్తి మహేశ్ మరింత రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేతపై కత్తి మహేశ్ విరుచుకుపడుతున్నారు. వరుస పోస్టులు పెడుతూ తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇప్పటికే ఎన్నో పోస్టులు పెట్టిన ఆయన.. తాజాగా చేసిన పోస్టు హాట్ టాపిక్ అవుతోంది. తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘‘చంద్రబాబు అపర చాణుక్యుడో లేక చేతకాని చవటో తెలుగుదేశం పార్టీలోని కమ్మోళ్ళు డిసైడ్ చేసి చెప్పేస్తే - మా అనాలిసిస్ మేము చేసుకుంటాం’’ అంటూ ఆయన వివాదాస్పద పోస్టు ఏపీ రాజకీయాల్లో హల్‌ చల్ చేస్తోంది. దీంతో దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులు - నాయకులు తెగ షేర్లు చేస్తున్నారు.

ఇదే కాదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడంపైనా కత్తి మహేశ్ స్పందించారు. దీనిపై ఆయన వినూత్నంగా పోస్ట్ చేశారు. ‘‘తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు గంపగుత్తగా బీజేపీలోకి ఎందుకు వెళ్లారు? 1. చంద్రబాబే వాళ్ళని బీజేపీకి అమ్ముకున్నాడు.. 2. వాళ్ళవాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి - జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఎంపీలే వెళ్లారు.. 3. రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ వీళ్ళని ఆకర్షించింది.. 4. పైనున్నవి అన్నీ (మల్టిపుల్ ఛాయ్స్ ప్రశ్న - 5 మార్కులు). సమాధానం తెలిసీ చెప్పకపోతే - చంద్రబాబుతో పాటు మీరు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది’’ అని పోస్ట్ చేశారు.

వాస్తవానికి కత్తి మహేశ్ అంటే గతంలో ఎవరికీ తెలియదు. ఆయన తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్‌ 1లో పాల్గొన్న తర్వాత సెలెబ్రిటీ అయిపోయారు. ఆ తర్వాత తరచూ మీడియా డిబెట్లలో పాల్గొనడంతో అందరికీ సుపరిచితులు అయ్యారు. ఇక, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ తో జరిగిన వివాదంతో కత్తి మహేశ్ ఒక్కసారిగా ఫేమ్ అయిపోయారు. ఈ వివాదం నడిచినంత కాలం ఆయన తన స్టాండ్‌ పైనే ఉన్నారు. ఆ తర్వాత శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో హైదరాబాద్ పోలీసులు ఆయనను నగర బహిష్కరణ చేశారు. అప్పటి నుంచి ఏపీలోనే ఉన్నారు.