Begin typing your search above and press return to search.

సొంతూరుకి క‌త్తి...చేర‌కుండానే తిప్పి పంపిన పోలీసులు

By:  Tupaki Desk   |   16 July 2018 10:33 AM GMT
సొంతూరుకి క‌త్తి...చేర‌కుండానే తిప్పి పంపిన పోలీసులు
X
వివాదాల‌తో ప్ర‌ముఖులైన వారికో చిత్ర‌మైన అల‌వాటు ఉంటుంది. వివాదాలు.. సంచ‌ల‌నాలే శ్వాస‌గా బ‌తికేస్తుంటారు. ఒక‌వేళ‌.. వివాదాలు.. సంచ‌ల‌నాలు లేని ప‌క్షంలో ఊపిరి ఆడ‌న‌ట్లుగా ఉంటుంది. ఇది చ‌దువుతున్న‌ప్పుడు తాత‌ల కాలం నాటి సామెత.. తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండమంటే ఉండ‌ద‌న్న‌ట్లుగా.. తాజాగా క‌త్తి ప‌రిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉన్నట్లుంది.

ఆ ఛాన‌లోడు ప్ర‌త్యేక చ‌ర్చా కార్య‌క్ర‌మం పెట్ట‌టం.. అందులో బైట్ కోసం ఊళ్లో లేని క‌త్తికి ఫోన్ చేసి మ‌రీ లైన్లోకి తీసుకోవ‌టం.. క‌త్తి లాంటి వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్నోడికి రాముడి మీద మాట్లాడ‌టం అంటే ఊరుకుంటాడా? అందులోకి తానేం మాట్లాడినా.. లైవ్ లో చూపించేస్తూ అంత‌కంత‌కూ సెల‌బ్రిటీ గ్రాఫ్ పెంచేస్తున్న వేళ త‌న‌కు అనిపించిన విష‌యాల‌న్నీ రాముడి మీద చెప్పేశాడు.

భావ‌స్వేచ్ఛ‌ను విప‌రీతంగా ప్రేమించే క‌త్తి త‌న భావ‌స్వేచ్చ‌ను వినియోగిస్తే.. సెంటిమెంట్ దెబ్బ తిన్నోళ్లంతా త‌మ భావ‌స్వేచ్చ‌ను ప్ర‌ద‌ర్శించ‌టం మొద‌లెట్టారు. అంద‌రూ ఒక ఎత్తు అయితే.. స్వామి ప‌రిపూర్ణానంద మ‌రోఎత్తు. క‌త్తి కంటే మొన‌గాడిన‌న్న ఫీలింగో ఏమో కానీ.. రాముడ్ని ట‌చ్ చేసిన క‌త్తిపై మాట‌ల క‌త్తి తిప్పాడు. అక్క‌డితో ఊరుకోకుండా త‌న నిర‌స‌న‌ను ప‌రిపూర్ణం చేసేందుకు ప్లాన్ చేశారు. టీవీ చ‌ర్చ‌ల్లో ఫోన్ల ద్వారానో.. లేదంటే టీవీ స్టూడియోకు వెళ్లి నోటితో చెప్పే మాట‌ల‌కు బ‌దులుగా వీధుల్లోకి వ‌స్తాన‌ని.. పెద్ద యాత్ర చేస్తాన‌ని చెప్పారు.

కేసీఆర్ ప్ర‌భుత్వం ఏమైనా ఉత్త‌నే ఉందా? అందులోని.. ఉద్య‌మాలు.. నిర‌స‌న‌ల‌తోనే పైకి వ‌చ్చిన పార్టీ ఆయే. రాష్ట్రాన్నే రెండు ముక్క‌లు చేసిన స‌త్తా ఉన్న కేసీఆర్‌కు.. రాముడి పేరుతో జ‌రిగే నిర‌స‌న యాత్ర‌కు కానీ ఓకే అనేస్తే లెక్క ఏదో తేడా కొడుతుంద‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లుంది. వెంట‌నే.. ఇచ్చిన ప‌ర్మిష‌న్ కు నో చెప్పేశారు.

దీంతో.. ర‌చ్చ మ‌రో లెవ‌ల్‌ కి వెళ్లింది. ఇదంతా కాద‌నుకున్న కేసీఆర్ క‌నుసైగ‌తో క‌త్తిపై హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేసేశారు. అక్క‌డితో ఆగితే త‌న నిర్ణ‌యంపై ప‌క్ష‌పాత ముద్ర ప‌డుతుంద‌ని అనుకున్నట్లున్నారు.. స్వామి ప‌రిపూర్ణానంద మీద కూడా బ‌హిష్క‌ర‌ణ వేటు వేసేశారు.

బ‌హిష్క‌ర‌ణ వేటు వేసిన త‌ర్వాత హైద‌రాబాద్ నుంచి ర‌క‌ర‌కాల మార్గాల్లో తిప్పి ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులో దించేయాల‌ని చూసినా... దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించి తెలంగాణ పోలీసులు బెంగుళూరులో వ‌దిలేశారు. ఆర్నెల్ల వ‌ర‌కూ హైద‌రాబాద్‌ లో కాలు పెట్టొద్ద‌న్న హెచ్చ‌రిక చేసి వెళ్లిపోయారు. ఏమ‌నుకున్నారో ఏమో కానీ..క‌త్తి మ‌హేశ్ సైతం ట్వీట్ చేసి.. గౌర‌వ‌ప్ర‌దంగానే తాను హైద‌రాబాద్‌ లోకి అడుగు పెడ‌తాన‌ని మాట ఇచ్చేశారు.

ఇదంతా బాగానే ఉన్నా.. నిత్యం వార్తల్లో న‌లిగే క‌త్తికి.. సొంతూర్లో సంద‌డి లేకుండా ఉండ‌టం న‌చ్చ‌లేన‌ట్లుంది. ఈ రోజు ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టేందుకు పీలేరులో ఆయ‌న మీడియా స‌మావేశానికి కాల్ ఫ‌ర్ చేశారు. మీడియా ప్ర‌తినిధుల‌తో పాటు పోలీసుల‌కు సైతం ప్రెస్ మీట్ స‌మాచారం అంద‌టం.. వెంట‌నే వారు రియాక్ట్ అయి మ‌హేశ్ మీద దాడి అవ‌కాశం ఉంద‌న్న స‌మాచారంతో తిరిగి బెంగుళూరుకు తిప్పి పంపారు. దీంతో ప్రెస్ మీట్ కూడా జ‌ర‌గ‌లేదు. పీలేరు నుంచి మ‌ద‌న‌ప‌ల్లెకు పంపి.. అక్క‌డి నుంచి బెంగ‌ళూరుకు పంపేశారు. మ‌రి.. బెంగ‌ళూరుకు తీసుకెళ్లిన త‌ర్వాత క‌త్తి అక్క‌డే ఉంటారా?. లేక‌.. య‌థావిధిగా అక్క‌డ కూడా ఏదో ఒక‌సంచ‌ల‌నానికి తెర తీస్తారా? అన్న‌ది వెయిట్ చేస్తే కానీ తేల‌దు.