Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన కలెక్టర్

By:  Tupaki Desk   |   17 Feb 2016 11:04 AM GMT
కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన కలెక్టర్
X
ఏపీలో చేర్చిన పోల‌వ‌రం ముంపు గ్రామాల్లో నాలుగైదు తిరిగి తెలంగాణ‌కు వ‌స్తాయ‌ని… ఇందుకు చంద్రబాబు కూడా అంగీక‌రించార‌ని కేసీఆర్ చేసిన ప్రక‌ట‌నపై ఏపీ నుంచి ఘాటైన స‌మాధాన‌మే వ‌స్తోంది. ఒక్క గ్రామాన్ని కూడా తిరిగిచ్చే ఆలోచ‌న లేద‌ని ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇప్పటికే స్పష్టం చేయ‌గా… తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కూడా ఘాటుగా మాట్లాడారు. ప‌.గో జిల్లాలో విలీనమైన కుకునూరు - వేలేరుపాడు మండలాల్లోని ఏ ఒక్క గ్రామం కూడా తిరిగి తెలంగాణ ప‌రిధిలోకి వెళ్లే ప‌రిస్థితే లేద‌ని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్ ఆ ప్రక‌ట‌న ఎందుకు చేశారో త‌న‌కు తెలియ‌ద‌ని ఏదీ ఏమైనా గ్రామాలు వెనక్కు ఇచ్చే ఆలోచన మాత్రం లేద‌ని తేల్చేశారు. అస‌లు గ్రామాల సర్దుబాటు అన్నది రాష్ట్రాల ప‌రిధిలోని అంశ‌మే కాద‌న్నారు. గ్రామాల‌ను బ‌ద‌లాయించాలంటే అందుకు పార్లమెంట్ ఒప్పుకోవాల‌ని గుర్తు చేశారు. అందు కోసం జిల్లాయంత్రాంగం నుంచి ప్ర‌తిపాద‌న‌లు పంపాల్సి ఉంటుంద‌ని… కానీ తాము ఆ ప‌ని చేయ‌లేద‌న్నారు. మొత్తం మీద ముంపు గ్రామాల‌ను తిరిగి అప్పగించేందుకు చంద్రబాబు ఒప్పుకున్నార‌ని కేసీఆర్ చెప్పడంతో క‌లక‌లం రేగింది. కేసీఆర్‌ తో చంద్రబాబు కుమ్మక‌య్యారంటూ ప్రచారం చేశారు. దీంతో వెంట‌నే ఏపీ త‌ర‌పున మంత్రి - క‌లెక్టర్ స్పందించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు మైండ్ గేమ్‌ లో భాగంగానే కేసీఆర్ ఆ ప్రక‌ట‌న చేసి ఉంటార‌ని భావిస్తున్నారు .