Begin typing your search above and press return to search.

మోడీ రాజ్యంలోనూ కశ్మీరీ పండిట్ల నోట ఈ మాటనా?

By:  Tupaki Desk   |   15 May 2022 2:59 AM GMT
మోడీ రాజ్యంలోనూ కశ్మీరీ పండిట్ల నోట ఈ మాటనా?
X
ఈ మధ్యన థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కశ్మీరీ ఫైల్స్ మూవీ గురించి తెలిసిందే. అప్పుడెప్పుడో చోటు చేసుకున్న దారుణ మారణకాండను కళ్లకు కట్టినట్లుగా చూపించిన వైనానికి యావత్ భారత్ ఉలిక్కిపడింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం.. ఇంత దారుణం మన దేశంలోని కశ్మీర్ లో చోటు చేసుకుందా? అంటూ ఆశ్చర్యానికి గురి కావటం తెలిసిందే. కొందరు ప్రముఖులు అయితే.. జరిగిన దానిలో పది శాతం కూడా చూపించలేదంటే.. మరికొందరు మాత్రం.. ఇదంతా ఉత్త బూటకం.. సినిమాటిక్ డ్రామానే తప్పించి.. ఇందులో నిజాలు లేవంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

ఇలాంటివేళ.. మోడీ భక్తులు రంగంలోకి దిగారు. మోడీలాంటి ప్రధానమంత్రి అప్పట్లో ఉండి ఉంటే.. పండిట్లకు న్యాయం జరిగేదని.. వారిపై జరిగిన మారణకాండను ఆయన నిలువరించి ఉండేవారంటూ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ చెలరేగిపోయారు. కట్.. చేస్తే ఇప్పుడు మోడీ రాజ్యంలోనూ కశ్మీర్ లో.. కశ్మీరీ పండిట్ల వెతలు మాత్రం తీరటం లేదు.

తాజాగా జమ్ముకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో 35 ఏళ్ల రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. అన్నింటికి మించిన కశ్మీరీ పండిట్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కశ్మీర్ లోయలో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనల్ని పండిట్లు ఎదుర్కొంటున్నారు. తమను కశ్మీర్ నుంచి వేరే ఎక్కడికైనా సురక్షిత ప్రదేశానికి తరలించాలని వారు కోరుకుంటున్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు 'ఆల్ పీఎం ప్యాకేజ్ ఎంప్లాయిస్ ఫోరమ్' పేరుతో ఉద్యోగులు ఒక లేఖ రాసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తమను తరలించటం వీలు కాకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

కశ్మీర్ లో కాకుండా ప్రపంచంలో మరెక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు చెబుతన్నారు. ''ఇక్కడ బతకలేకపోతున్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ మమ్మల్ని చంపేస్తున్నారు'' అని వారు వాపోతున్నారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న రాహుల్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో ఆయన మరణించారు. ఈ ఉదంతం తర్వాత దాదాపు 350 మంది కశ్మీరీ పండిట్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తే ఆ లేఖల్ని లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇచ్చారు.

ఇక్కడ రెండు విషయాల్ని ప్రస్తావించాలి. అందులో మొదటిది.. కశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయంపై పెద్దగా స్పందించని కశ్మీర్ ముస్లింలు.. కశ్మీర్ ఫైల్స్ మూవీ తర్వాత నొక్కిన సన్నాయి నొక్కుల గురించి తెలిసిందే. చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపించారని.. తమను విలన్లుగా చిత్రీకరించారని వారువాపోయారు. ఒకవేళ.. వారి వేదన నిజమైతే.. ఇప్పుడు కశ్మీరీ పండిట్ల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించి.. వారికి భరోసా కల్పిస్తూ.. తామున్నామని ఎందుకు ప్రకటనలు చేయట్లేదు?

కశ్మీరీ పండిట్లకు మద్దతు తెలపని బుద్ధజీవులు.. సెక్యులరిస్టులు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా? కశ్మీర్ ఫైల్స్ మూవీని తిట్టిపోయటానికి తెరిచిన నోళ్లు..ఇప్పుడు ఎందుకు మూత పడుతున్నాయి. మైనార్టీల సంక్షేమం కోసం మాత్రం మాట్లాడే వామపక్షాలు.. వారి విధానాన్ని గుడ్డిగా ఫాలో అయ్యే మేధావుల మాటేంటి? రెండోది.. మోడీ ఉంటే 'ఇలా జరిగేది కాదు.. అలా జరిగేది కాదు' లాంటి మాటల్ని వీరావేశంతో మాట్లాడే వారంతా ఇప్పుడు జరిగిన దారుణం మోడీ ప్రధానమంత్రిగా ున్నప్పుడే అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కశ్మీరీ పండిట్ల విషయంలో కేంద్రం మాత్రమే కాదు.. దేశ ప్రజలు గతంలో తప్పుగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి తప్పే జరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా రియాక్టు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.