Begin typing your search above and press return to search.

'తాత లే ఇంటికి పోదాం'...కంటతడి పెట్టిస్తున్న చిన్నారి ఫోటో!

By:  Tupaki Desk   |   1 July 2020 10:10 AM GMT
తాత లే ఇంటికి పోదాం...కంటతడి పెట్టిస్తున్న చిన్నారి ఫోటో!
X
ఈ రోజు తెల్లవారుజామున కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఓ జవాన్ మరొకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన లో మూడేళ్ల చిన్నారిని ఉగ్ర వాదుల కాల్పుల బారిన పడకుండా భద్రత దళాలు రక్షించాయి. అయితే, ఉగ్ర వాదుల దాడి లో ఈ బాలుడి తాత ప్రాణాలు కోల్పోగా.. రక్తపు మడుగు లో పడి ఉన్న ఆయన మృత దేహం పై ఈ చిన్నారి కూర్చుని ఉన్న ఫోటో ఇప్పుడు అందర్నీ కంట తడి పెట్టిస్తోంది.

అయితే , కాల్పుల సమయం లో ఎంతో చాక చక్యం గా వ్యవహరించిన సైన్యం అక్కడ నుంచి ఆ బాలుడి ని తప్పించింది. ఆ బాలుడ్ని సురక్షితంగా ఓ జవాన్ తీసుకొచ్చినట్టు కశ్మీర్ పోలీసులు ట్విట్టర్‌లో వెల్లడించారు. సోపోర్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి మూడేళ్ల బాలుడ్ని పోలీసులు రక్షించారు అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని బారాముల్లా జిల్లా సోపోర్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆ బాలుడు తన తాతతో కలిసి శ్రీనగర్ నుంచి హంద్వారాకు కారులో వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో సోపోర్ వద్ద సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో కారులో ఉన్న పెద్దాయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.