Begin typing your search above and press return to search.

రాజ్యసభలో రాజ్యాంగాన్ని చించేసి..చొక్కాలు చింపేసుకున్నారు!

By:  Tupaki Desk   |   5 Aug 2019 8:08 AM GMT
రాజ్యసభలో రాజ్యాంగాన్ని చించేసి..చొక్కాలు చింపేసుకున్నారు!
X
సుదీర్ఘ కాలంలో వేధిస్తున్న సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు వీలుగా మోడీ సర్కారు తీసుకున్న సంచలన 370 అధికరణాన్ని రద్దు చేసిన వైనంపై సంచలనాల మీద సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నిర్ణయంపై దేశ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే.. పలు రాజకీయ పార్టీలు మాత్రం అందుకు భిన్నంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కశ్మీర్ కు చెందిన నేతలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు.

వారి నిరసనలు హద్దులు దాటటమే కాదు.. ఇలాంటి తీరు భారతదేశంలో మాత్రమే చోటు చేసుకుంటుందన్న భావన కలిగేలా వారు వ్యవహరించారు. ఆర్టికల్ 370 రద్దు.. జమ్ముకశ్మీర్ విభజన బిల్లులపై నిరసనలు తెలిపిన వారు.. నల్ల బ్యాడ్జీలు కట్టుకొని పార్లమెంటుకు హాజరయ్యారు. సభలో బిల్లులు ప్రవేశ పెట్టిన తర్వాత అనూహ్యంగా వ్యవహరించారు పీడీపీ ఎంపీలు.

రాజ్యాంగ ప్రతుల్ని సభలోనే చించి వేయటమే కాదు.. తమ చొక్కాల్ని చించేసుకున్నారు. ఈ పరిణామం సభలో తీవ్ర గందరగోళం నెలకొనేలా చేసింది. వీరి ప్రవర్తనపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభలో అనుచితంగా వ్యవహరించిన పీడీపీ ఎంపీలను మర్షల్స్ సాయంతో బయటకు పంపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్ కు చెందిన పలు రాజకీయ పార్టీ నేతలు మోడీ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజుగా అభివర్ణించారు. మరోవైపు.. దశాబ్దాలుగా సాగుతున్న కశ్మీర్ పంచాయితీకి మోడీ సర్కారు సరైన నిర్ణయం తీసుకున్నారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.