Begin typing your search above and press return to search.

బుర్హాన్ వని షాకింగ్ విషయాలివి..

By:  Tupaki Desk   |   26 Sep 2016 11:11 AM GMT
బుర్హాన్ వని షాకింగ్ విషయాలివి..
X
ఉగ్రవాదిగా ముద్ర వేయించుకోవటమే కాదు.. ఇటీవల ఎన్ కౌంటర్ లో హతమైన హిజ్ బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీకి చెందిన షాకింగ్ విషయాల్ని వెల్లడించారు అతని తండ్రి. తన కుమారుడికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాన్ని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ గా పని చేస్తున్నారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలని చెబుతుండేవాడినని చెప్పిన ఆయన.. తన కుమారుడు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందించాలన్న కోరికను వ్యక్తం చేసినట్లు చెప్పారు.

అంతేకాదు.. ఏదో ఒక రోజున కశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ మాదిరి క్రికెటర్ కావాలని.. భారత్ కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకున్న విషయాన్ని వెల్లడించారు. తాను ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నానని చెప్పిన ఆయన.. రెండు నెలలుగా తానెంతో నష్టపోయానని వెల్లడించారు. భారత్ నుంచి కానీ జమ్ము కశ్మీర్ సర్కారు నుంచి స్పందన ఆశించానని.. కానీ అలాంటిదేమీ లేదని తీవ్ర‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బుర్హాన్ వనీ 2010 అక్టోబరులో ఇల్లు విడిచి వెళ్లిపోయాడని.. ఆ తర్వాత మిలిటెంట్లలో కలిసిపోయినట్లు తెలిసిందని చెప్పారు. తన కుమారుడికి తానెంతో నచ్చ జెప్పానని.. మార్చాలని ఎంతగానో చూశానన్నారు. రెండేళ్ల క్రితం చివరిసారిగా అతడ్ని చూసినట్లు చెప్పిన ఆయ‌న‌.. జమ్ముకశ్మీర్ కోసమే తన కుమారుడు పని చేసినట్లుగా వెల్లడించారు. వనికి ముందు తన పెద్ద కుమారుడు ఖలీద్ గత ఏప్రిల్ లో భద్రతా దళాల చేతిలో హతమైనట్లు చెప్పారు. బుర్హాన్ ఎన్ కౌంటర్ తర్వాత ప్రజలు భద్రతా దళాలపై పోరాడటం కోసం ఆయుధాలు చేపట్టినట్లుగా మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని.. కశ్మీర్ ప్రజలు అటు పాకిస్థానీయుల్ని.. ఇటు భారతీయుల్ని సమానంగా ప్రేమిస్తారని వ్యాఖ్యానించారు. ఉరీ ఉగ్రఘటనలో పాక్ పాత్రపై ప్రశ్నించినప్పుడు.. భారత్ లోని ముస్లిం లేదంటే కశ్మీర్ మిలిటెంట్ల పని కూడా కావొచ్చు కదా? అని వ్యాఖ్యానించటం గమనార్హం.