Begin typing your search above and press return to search.

కసబ్ చేతికి ఎర్రదారం వెనుక అంత భారీ స్కెచ్

By:  Tupaki Desk   |   19 Feb 2020 5:40 AM GMT
కసబ్ చేతికి ఎర్రదారం వెనుక అంత భారీ స్కెచ్
X
ముంబయి మారణ హోమంలో పాల్గొన్న ఉగ్రవాదుల్ని హతమార్చగా.. అజ్మల్ అమీర్ కసబ్ ను మాత్రం పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. భుజానికి సంచి.. చేతిలో మర తుపాకీతో మారణహోమానికి పాల్పడిన ఈ కరడుగట్టిన ఉగ్రవాదికి సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. కసబ్ పాకిస్తాన్ కు చెందిన వాడని.. అతగాడు ఫరీద్ కోటకు చెందిన వ్యక్తిగా గుర్తించటం తెలిసిందే. ముస్లిం అయిన కసబ్ చేతికి ఎర్రదారం ఎందుకు ఉందన్న విషయం మీద చర్చ జరిగినా.. దానికి సంబంధించిన సమాచారం బయటకు రాలేదు.

తాజాగా ఆ విషయానికి సంబంధించిన విస్మయకర విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. ‘లెట్ మీ సే ఇట్ నౌ’ అనే పుస్తకాన్ని రాశారు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మరియా. తాజాగా బయటకు వచ్చిన ఈ పుస్తకంలో షాకింగ్ నిజాల్ని ఆయన బయటపెట్టారు. కసబ్ ను బెంగళూరుకు చెందిన సమీర్ దినేశ్ చౌదరిగా నమ్మించే ప్రయత్నం జరిగిందని చెప్పారు. ఒకవేళ కసబ్ కానీ పోలీసుల కాల్పుల్లో మరణించి ఉంటే.. అతడ్ని బెంగళూరుకు చెందిన వ్యక్తిగా.. హైదరాబాద్ లో చదువుకున్నట్లుగా భావించి.. దానికి సంబంధించి దర్యాప్తు సాగేది. ఎందుకంటే.. కసబ్ దుస్తుల్లో దీనికి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ల ను ఉంచారు.

అయితే..ప్రాణాలతో పట్టుబడిన కసబ్.. అన్ని నిజాల్ని ఒక్కొక్కటిగా బయటకు చెప్పటంతో పాక్ దుర్మార్గపు కుట్ర బయటకు వచ్చింది. కసబ్ నుహిందువుగా నమ్మించేందుకు అతని చేతికి ఎర్ర తాడును కట్టారని.. బెంగళూరులో బోగస్ అడ్రస్ తో కూడిన పత్రాల్ని తయారు చేశారని పుస్తకంలో వెల్లడించారు. అతను ప్రాణాలతో పట్టుబడి ఉండక పోతే హిందువే ఈ దారుణానికి పాల్పడినట్లుగా అందరిని నమ్మించాలన్న ప్రయత్నం జరిగింది. అయితే.. కసబ్ పోలీసులకు ప్రాణాలతో దొరకటం తో ఆ విష పాచిక పారలేదు.

అంతేకాదు.. కసబ్ కు దారుణమైన అబద్దాలు చెప్పి భారత్ మీద రగిలిపోయేలా చేశాడు. భారత్ లోని మసీదుల్లోకి ముస్లింలను రానివ్వరని.. మసీదులకు తాళాలు వేస్తారని నూరిపోశారు. క్రైం బ్రాంచ్ లాకప్ లో ఉన్న వేళ.. అక్కడికి దగ్గర్లోని మసీదు నుంచి వచ్చే నమాజ్ విన్నప్పుడు కూడా అది తన భ్రమగా ఫీలయ్యేవాడే కానీ నిజమని నమ్మేవాడు కాదని తెలిపారు. మసీదుల్లో నమాజ్ చదువుతారని తెలిసిన తర్వాత తనను తీసుకెళ్లానని కోరాడని.. మసీదుకు తీసుకెళ్లగానే అక్కడి పరిస్థితిని చూసి కసబ్ ఆశ్చర్య పోయినట్లుగా పుస్తకం లో పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు పాక్ దుర్మార్గం ఎంత ఎక్కువగా ఉంటుందో ఇట్టే అర్థం కాక మానదు.