Begin typing your search above and press return to search.

కార్వీ ఉద్ధానపతనం ఇలా..

By:  Tupaki Desk   |   3 Dec 2019 6:39 AM GMT
కార్వీ ఉద్ధానపతనం ఇలా..
X
దేశంలోనే అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో ఒకటైన కార్వీ లైసెన్సును రద్దు చేస్తూ నేషనల్ స్టాక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్చేంజులు నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనలు ఉల్లంఘించడం, అవకతకవలు పాల్పడడం వంటివి గుర్తించడంతో కార్వీ స్టాక్ బ్రోకింగు లైసెన్సును రద్దు చేశారు. ఆ వెంటనే తమ ట్రేడింగు టెర్మినళ్లను కార్వీ యాక్సెస్ చేసుకోవడానికి కూడా లేకుండా చేశారు. దీంతో కార్వీ ఉద్యోగులు కానీ, కార్వీ ఖాతాదారులు కానీ ఈక్విటీ, డెట్, కరెన్సీ, డెరివేటివ్స్, కమోడిటీ వంటి ఏ విభాగంలోనూ క్రయవిక్రయాలు చేసే అవకాశం పోయింది. ఒక్క డెరివేటివ్స్ విభాగంలో ఇప్పటికే ఉన్న పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసే వీలుంది.. కొత్త పొజిషన్లు తీసుకోవడానికి కుదరదు. దేశంలోనే ప్రధానమైన స్టాక్ బ్రోకింగ్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగిన కార్వీ ఇప్పుడు పూర్తిగా కుదేలవడం ఆ సంస్థ ఖాతాదారులను షాక్‌కు గురిచేస్తోంది.

కార్వీకి ప్రస్తుతం బ్రోకింగ్ విభాగంలో లక్షల మంది ఖాతాదారులున్నారు. పార్థసారథి సారథ్యంలో అయిదుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు కార్వీని 1983లో ప్రారంభించారు. 1990లో హెచ్ఎస్ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్‌గా రిటైల్‌లో బ్రోకింగ్ ప్రారంభించింది. 1997లో ఎన్ఎస్‌డీఎల్, సీడీఎస్ఎల్‌లకు డీపీగా మారింది. 2003లో డెట్ బ్రోకింగ్ కూడా ప్రారంభించింది. 2014లో ఆధార్, బీపీఓ సర్వీసుల వ్యాపారంలోకీ వచ్చింది. 2018లో హెచ్‌సీఎల్ కార్వీని సొంతం చేసుకుని కార్వీ ఇన్నోటెక్‌గా మార్చింది. కార్వీ గ్రూపులో స్టాక్ బ్రోకింగ్, కేపిటల్స్ వంటి పేర్లతో 30 కంపెనీలున్నాయి. రియాల్టీ, రెన్యువబుల్ ఎనర్జీ, డాటా మేనేజ్‌మెంట్ వంటి అనే వ్యాపారాలు చూసే సంస్థలున్నాయి. వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీ కార్వీ స్టాక్ బ్రోకింగే.

కార్వీపై సెబీ కొరడా ఝుళిపించాక గత వారం పార్థసారథి కార్వీ ఫిన్‌టెక్‌కు రాజీనామా చేశారు. అప్పటి వరకు ఆయన కార్వీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరించేవారు. మొత్తానికి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కార్వీ సంస్థ చివరకు అక్రమాలు, అవకతవకలతో ఒక్కసారిగా కుప్పకూలడం వ్యాపారవర్గాల్లో చర్చనీయంగా మారింది.