Begin typing your search above and press return to search.

క‌రుణానిధి ఖాతాలో అల్టిమేట్ రికార్డ్

By:  Tupaki Desk   |   19 May 2016 4:07 PM GMT
క‌రుణానిధి ఖాతాలో అల్టిమేట్ రికార్డ్
X
91 ఏళ్ల వ‌య‌సులో సీఎం పీఠంపై కూర్చోవాల‌నే చివ‌రి ఆశ‌తో తమిళనాడు శాసనసభ ఎన్నికల బ‌రిలో దిగిన‌ డీఎంకే అధినేత కరుణానిధికి ఆ కోరిక తీర‌క‌పోయిన‌ప్ప‌టికీ...మ‌రో రికార్డు మాత్రం త‌న సొంతం చేసుకున్నారు. త‌మిళనాడులోని తిరువరూర్ నియోజకవర్గం నుంచి కరుణానిధి పోటీ చేసి గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ గెలుపు ఆషామాషీ కాదు. ఏకంగా 13వ సారి ఈ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచే తమిళనాడు శాసనసభకు కరుణానిధి ఎన్నికయ్యారు.

తిరువ‌రూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బరిలో నిల‌చిన అన్ని శాసనసభ ఎన్నికల్లోనూ కరుణానిధి గెలుపొంది రికార్డు సృష్టించారు. త‌మిళ రాజ‌కీయాల్లో ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇన్ని సార్లు బ‌రిలోకి దిగి, దిగిన ప్ర‌తిసారి విజ‌యం సాధించిన వ్య‌క్తి క‌రుణానిధి ఒక్క‌రే కావ‌డం ఆస‌క్తిక‌రం. ఇదిలాఉండ‌గా...90 ఏళ్ల వ‌య‌సులోనూ పార్టీ ఎన్నిక‌ల భారాన్ని త‌న‌పై వేసుకున్న క‌రుణానిధి తమిళనాడులో విస్తృతంగా ప‌ర్య‌టించారు. అయితే ప్ర‌తిప‌క్షాల ఓట్ల చీలిక‌తో ఫ‌లితం ద‌క్క‌లేదు. అన్నాడీఎంకే మెజార్టీ స్థానాల్లో విజ‌యం సాధించి జ‌య‌లలిత తిరిగి సీఎం పీఠం అధిరోహించ‌నున్నారు. ఈ ఫ‌లితాల్లో క‌రుణానిధికి చెందిన డీఎంకే రెండో స్థానంలో నిలిచింది.

డీఎండీకే అధినేత కెప్టెన్ విజ‌య్‌కాంత్‌ పొత్తు విష‌యంలో జ‌రిగిన జాప్యం, అధికార ప‌క్ష‌మైన జ‌య‌ల‌లిత‌కు వ్య‌తిరేక ఓట్ల‌ను కెప్టెన్ చీల్చ‌డంలో స‌ఫ‌ల‌మ‌వ‌డంతో క‌రుణానిధి అధికార పీఠానికి దూర‌మ‌య్యార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. దీంతో పాటు క‌రుణానిధి కుటుంబంలోని అంత‌ర్గ‌త క‌ల‌హాలు కూడా ఆయ‌న ప్రాభ‌వాన్ని ప‌లుచ‌న చేశాయ‌ని చెప్తున్నాయి. అయితే చెన్నై న‌గ‌రంలో మాత్రం క‌రుణ నేతృత్వంలోని డీఎంకే అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డం ఆయ‌నకు గొప్ప ఉప‌శ‌మ‌న‌మ‌ని వివ‌రిస్తున్నారు.