Begin typing your search above and press return to search.

మోడీ కల నెరవేరుస్తున్న సిద్ధరామయ్య

By:  Tupaki Desk   |   6 Aug 2015 9:35 AM GMT
మోడీ కల నెరవేరుస్తున్న సిద్ధరామయ్య
X
ప్రధాని మంత్రి నరేంద్రమోడీ కలల పంటగా వస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమానికి బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న కర్ణాటక చుక్కాని అయ్యేలా కనిపిస్తోంది. మోడీ అత్యంత ఇష్టపడుతున్న, ఎంతో ఆసక్తి చూపిస్తున్న డిజిటల్ ఇండియాలో కర్ణాటక లీడ్ రోల్ పోషించడానికి సిద్ధమవుతోంది.

సాప్ట్ వేర్, టెక్నాలజీ రంగాల్లో దేశంలో టాప్ లో ఉన్న కర్ణాటక రాష్ట్రం సహజంగానే డిజిటల్ ఇండియాలో లీడ్ రోల్ పోషించే స్థాయిలో ఉంది.. దానికితోడు అక్కడి సీఎం సిద్ధరామయ్య కూడా డిజిటల్ ఇండియాపై ప్రత్యేక దృష్టి సారించడంతో మరింత కీలకంగా మారనుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సూచనలతో ఆ రాష్ట్ర ఈ-గవర్నెన్సు విభాగం ఈ-డిస్ట్రిక్ట్ అనే పథకం పరిధిలోకి 376 రకాల సేవలను తీసుకొచ్చి సేవలందించనున్నారు. ఇదంతా మూడు నెలల్లో పూర్తిచేయాలని కర్ణాటక లక్ష్యంగా పెట్టుకుంది. 376 రకాల సేవలను ఎలక్ట్రానిక్ పాలన పరిధిలోకి తెచ్చిన రాష్ట్రం ఇంకేదీ లేదు. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర 85 రకాల సేవలను మాత్రమే డిజిటలైజ్ చేసింది. ఇంతవరకు ఈ విషయంలో మహారాష్ట్ర టాప్ లో ఉండగా ఇప్పుడు కర్ణాటక 376 రకాల సేవలతో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. దీంతో డిజిటల్ ఇండియాలో కర్ణాటక ప్రధాన పాత్ర పోషించబోతోంది.

కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ-సర్వీసులు ప్రారంభించినా వాటిని సక్రమంగా అమలు చేయలేకపోతున్నాయి. కానీ, టెక్నికల్ గా మంచి అనుభవం ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఈ-సర్వీసుల అమల్లో దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ప్రయత్నిస్తోంది. కర్ణాటక ఈ-గవర్నెన్సు సీఈఓ రతన్ కేల్కర్ తామందించే ఈసర్వీసులు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తాయని... ఇండియాలో ది బెస్ట్ అనిపించుకుంటామని చెబుతున్నారు.

కాగా... రెవెన్యూ, మోటారు వాహనాలు, విద్య, పోలీస్ సేవలు, అటవీ, పారిశ్రామిక, వెనుకబడిన వర్గాలు, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు వంటి శాఖలన్నింటినీ దీని పరిధిలోకి తెస్తున్నారు. బెంగళూర్ వన్, కర్ణాటక వన్... కేంద్రం ఆధ్వర్యంలో నడిచే అటల్ జనస్నేహి కేంద్ర్ వంటి కేంద్రాలు(ఏపీలో ఈసేవా కేంద్రాలు మాదిరిగా)కు వెళ్లి అక్కడ తగిన పత్రాలు చూపిస్తే ఎలాంటి ప్రభుత్వ సేవలనైనా పొందేలా ఈ పాలన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

5000 సేవా కేంద్రాల ద్వారా ప్రస్తుతానికి 376 రకాల సేవలందిస్తారు. భవిష్యత్తులో 1200 రకాల సేవలను ప్రజలు ఈపాలనలో పొందేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొత్తానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సమున్నత లక్ష్యాన్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కీలక పాత్ర పోషించడం ఆసక్తి కరమే.. అయితే.. కర్ణాటకలో.. ప్రత్యేకించి బెంగళూరు కేంద్రంగా ఐటీరంగం విస్తరించడం.. ఐటీ సేవల పరంగా ఇప్పటికే కర్ణాటక అగ్రగామిగా ఉండడంతో ఈ డిజిటలైజేషన్ కర్ణాటకకు సులభమవుతోందని చెబుతున్నారు.

హైటెక్ సీఎం గా అందరూ పిలిచే ఏపీ ముఖ్యమంత్రి ఈ డిజిటల్ ఇండియా పోటీలోకి దిగితే అప్పుడు సీనెలా మారుతుందో చూడాలి. ప్రస్తుతానికి ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణంలో తలమునకలై ఉన్న ఆయన డిజిటల్ ఇండియా మీద కన్నేస్తే ఏపీ కూడా టాప్ లోకి రావడం ఖాయం.