Begin typing your search above and press return to search.

మంత్రి మూడ‌న‌మ్మ‌కం 'రోజుకు 340 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం'

By:  Tupaki Desk   |   5 July 2018 12:33 PM GMT
మంత్రి మూడ‌న‌మ్మ‌కం రోజుకు 340 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం
X
న‌మ్మ‌కం ఉండ‌టం త‌ప్పుకాదు. అది మూడ‌న‌మ్మ‌కంగా మార‌కుండా చూసుకోవ‌డమే త‌ప్పు. అయితే ఈ తప్పొప్పులు వ్య‌క్తుల‌ను బ‌ట్టి మారుతుంటాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. అలా చిత్ర‌మైన న‌మ్మ‌కంతో ఓ మంత్రి వార్త‌ల్లో నిలిచారు. ఆయ‌నే మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు - కర్ణాటక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌ మెంట్ మంత్రి హెచ్‌ డీ రేవణ్ణ‌. అంతేకాదు త‌న సోద‌రుడైన సీఎం కుమారస్వామికి ప‌ద‌వీగండం రాకుండా ఉండేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్‌ ను కూడా వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేయించారు.

దేవ‌గౌడ‌ కుటుంబం మొత్తం మత విశ్వాసాలు - జ్యోతిష్యం - వాస్తుశాస్ర్తాలను కచ్చితంగా ఆచరిస్తుందన్న పేరుంది. అందులోనూ ఈ మంత్రికి మూఢ విశ్వాసాలు కాస్త ఎక్కువే. ప్రతి పని చేసే ముందు జాతకాలు చూడటం.. జ్యోతిష్యులు చెప్పినట్లు చేయడం ఆయనకు అలవాటు. ఆ మూఢ నమ్మకమే ఇప్పుడు ఆయనను రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తోంది.మంత్రి రేవణ్ణ‌ ప్రతి రోజూ బెంగళూరుకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంతూరు హొలెనరసిపురకు వెళ్లి వస్తుంటారు. పోవడానికి మూడు గంటలు - రావడానికి మూడు గంటలు.. అంటే మొత్తం రోజుకు ఆరు గంటలు మంత్రి ప్రయాణానికే స‌రిపోతోంది. ఇంత‌కీ ఇలా ఎందుకు అంటే.. బెంగళూరులో రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అని ఓ జ్యోతిష్కుడు చెప్పాడట. రేవణ్ణ‌ బెంగళూరులో ఉంటే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పడంతో ఆయనిలా రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఈ విశ్వాసంతోనే ఆయనిలా రోజూ తన సొంతూరుకు వెళ్లి వస్తున్నట్లు జేడీఎస్ వర్గాలు కూడా స్పష్టంచేశాయి. రేవణ్ణ‌ బెంగళూరులో ఉంటే ప్రభుత్వం కూలిపోతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. అప్పటి నుంచి ఆయన దీనిని కచ్చితంగా ఫాలో అవుతున్నారు. జ్యోతిష్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది అని ఓ జేడీఎస్ నేత చెప్పారు.

తాను మంత్రిగా ప్రమాణం చేయడానికి కచ్చితమైన సమయాన్ని పెట్టుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 2.12 గంటలకు ప్రమాణం చేశారు. అందుకే తనకంటే సీనియర్ అయిన ఆర్వీ దేశ్‌ పాండే కంటే ముందే తాను వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు. ఆయన వాస్తులాంటి అన్ని రకాల విశ్వాసాలను బలంగా నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారమే సీఎం కుమారస్వామి సమావేశాలను రేవణ్ణ‌ ఏర్పాటు చేస్తుంటారు. కాగా, గతంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలని ప్రయత్నించగా.. అది ఎన్నో అడ్డంకుల మధ్య చాలా ఆలస్యంగా పాసయింది. రేవణ్ణ లాంటి సీనియర్ నేతలే ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడారు. అయితే రేవ‌ణ్ణ‌ మాత్రం దీనిని ఖండించారు. బెంగ‌ళూరులో త‌న‌కు ఇంకా ఇల్లు కేటాయించ‌లేద‌ని, అందుకే తాను రోజూ సొంతూరుకి వెళ్లి వ‌స్తున్న‌ట్లు చెప్పారు.