Begin typing your search above and press return to search.

బెంగుళూరు అల్లర్లు పక్కా స్కెచ్ అన్న మంత్రి , ఎస్డీపీఐ నేత అరెస్ట్ !

By:  Tupaki Desk   |   12 Aug 2020 12:10 PM GMT
బెంగుళూరు అల్లర్లు పక్కా స్కెచ్ అన్న మంత్రి , ఎస్డీపీఐ నేత అరెస్ట్ !
X
ఓ పేస్ బుక్ పోస్ట్ ... ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యే బంధువు ఒకరు ఫేస్ ‌బుక్‌ లో పోస్ట్ పెట్టారని, అల్లరి మూకలు బెంగళూరులో విధ్వంసం సృష్టించారు. పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ ‌మూర్తి బంధువు ఫేస్‌ బుక్‌ లో పెట్టిన పోస్ట్.. తమ వర్గం మనోభావాలను కించపరిచేలా ఉందని దాడికి పాల్పడి ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటికి, పోలీస్ స్టేషన్‌కు కూడా నిప్పటించారు. ఈ దాడిలో 13 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ అల్లర్లను అదుపులోకి తేవడం కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. అలాగే ఇదే ఆందోళన కారుల, దాడిలో ఏసీపీ సహా 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి.

అయితే , అంతమంది ఒకేసారి ఎలా గుమ్మిగూడారు.. పోలీస్‌ స్టేషన్‌ పై ఎలా దాడి చేయగలిగారు.. అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ ఒకే ముక్కలో సమాధానం ఇచ్చారు కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి. బెంగళూరులో చోటు చేసుకున్న అల్లర్ల వెనుక కుట్ర కోణం దాగి ఉందని అన్నారు. పక్కా స్కెచ్ ప్రకారమే.. పథకం ప్రకారమే ఈ దాడులు చోటు చేసుకున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. తాను చెప్పిన పాయింట్ తో పోలీసులు దర్యాప్తు చేయాలనీ అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం..ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటిపై ఒక వర్గానికి చెందిన వారు ఉద్దేశపూరకంగా దాడి చేసినట్లు అనుమానిస్తున్నానని, మహ్మద్ ప్రవక్తను కించపరిచినట్టుగా భావిస్తోన్న వ్యాఖ్యలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే వేలాదిమంది ఎలా ఒకేచోట గుమికూడగలిగారని సీటీ రవి ప్రశ్నించారు. అల్లరి మూక దాడుల్లో 200 నుంచి 300 వాహనాలు ధ్వంసం అయ్యాయని అన్నారు. అన్ని వాహనాలను నాశనం చేయడానికి అవసరమైన సామాగ్రి అప్పటికప్పుడు ఎలా వచ్చింది అని అనుమానం వ్యక్తం చేశారు.

దీని వెనుక సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) హస్తం ఉందని సీటీ రవి ఆరోపణలు చేసారు. సీటీ రవి ఎస్డీపీఐపై అనుమానాలను వ్యక్తం చేసిన సమయంలోనే బెంగళూరు నగర పోలీసులు.. అదే సంఘానికి చెందిన నేతను అరెస్టు చేయడంతో అయన వ్యాఖ్యలకి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎస్డీఐపీ కన్వీనర్ ముజామిల్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

కేజీ హల్లి, డీజే హల్లి, భారతి నగర్, పులికేశి నగర్, బాన్సవాడి పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతుంది. బెంగళూరు నగరం అంతటా 144 సెక్షన్ అమలవుతోంది. అల్లర్లపై గవర్నర్‌కు కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మయి పూర్తిస్థాయి నివేదిక అందజేశారు. పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సమీప బంధువు నవీన్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును వ్యతిరేకిస్తూ.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో అల్లరి మూక ఎమ్మెల్యే ఇంటిపై మూక దాడికి పాల్పడింది. ఆందోళన కారులు నిప్పు పెట్టడం తో ఎమ్మెల్యే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ సమయంలో ప్రజలు శాంతిని, సంయమనాన్ని పాటించాలని శ్రీనివాస మూర్తి విజ్ఙప్తి చేశారు.