Begin typing your search above and press return to search.

ఈ హోం మంత్రికీ నోటి దురద ఎక్కువే

By:  Tupaki Desk   |   14 Nov 2015 9:27 AM GMT
ఈ హోం మంత్రికీ నోటి దురద ఎక్కువే
X
ఉత్తరాదిలో బీజేపీ మంత్రులు - ఎంపీలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక నేతలూ వారిని చూసి ప్రభావితం అవుతున్నారో ఏమో కానీ తమ నోటిని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దాంతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏదో చిన్నాచితకా నేతలైతే ఫరవాలేదు... ఏకంగా కర్ణాటక మంత్రులే తమ నోటి దురదను ప్రదర్శించుకుంటూ వివాదాలకు కారణమవుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక హోం మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర మరోమారు నోరు జారారు.

బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ లో జరిగిన గ్యాంగ్ రేప్ విషయంపై స్పందించిన కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో బాధితురాలు అక్కడ ఎందుకు ఉందని అని ప్రశ్నించారు. తుమకూరుకు చెందిన 33 ఏళ్ల మహిళ టెన్నిస్ శిక్షణ కోసం బెంగళూరు వచ్చిన సమయలో గ్యాంగ్ రేప్ జరగిందని, ఇలా జరగడం దురదృష్టకరం అని చెప్పిన పరమేశ్వర.. ఆ తరువాత నోరు జారారు. అసలు ఆ సమయంలో ఆమెకు అక్కడ ఉండాల్సిన అవసరమేంటని వివాదానికి తెరతీశారు. దీంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మండిపడ్డారు. కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం వలన ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళుతాయని వెంటనే ఆయన రాజీనామా చెయ్యాలని మేనకా గాంధీ డిమాండ్ చేశారు. పరమేశ్వర కు మంత్రి పదవి వద్దనుకుంటే ఆ స్థానం నుంచి తప్పుకోవాలని మేనకా గాంధీ సూచించారు.

గత గురువారం తుమకూరుకు చెందిన మహిళపై కబ్బన్ పార్క్ లో ఇద్దరు సెక్యూరిటి గార్డులు గ్యాంగ్ రేప్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగిని మీద ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన సందర్బంలో అప్పటి హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకరు, ఇద్దరు చేస్తే అది రేప్ అవుతుందని, అది గ్యాంగ్ రేప్ కాదని కామెంట్ చేసి ప్రజల దగ్గర చివాట్లు తిన్నారు. ఇప్పుడు కొత్త హోం మంత్రి కూడా తన నోటి దురదతో చీవాట్లు తింటున్నారు.