Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో ఫుడ్ ప‌డేస్తే జైలుశిక్ష‌?

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:25 AM GMT
ఆ రాష్ట్రంలో ఫుడ్ ప‌డేస్తే జైలుశిక్ష‌?
X
ఆహారం కోసం అల్లాడిపోయే వాళ్లెంద‌రో క‌నిపిస్తారు. ఒక్క‌పూట క‌డుపు నిండా భోజ‌నం దొర‌క్క విల‌విల‌లాడే వారెందో. ఇదో కోణ‌మైతే.. ఆహారాన్ని వృధాగా ప‌డేయ‌టం మ‌రోవైపు క‌నిపిస్తుంది. పెళ్లిళ్లు.. విందులు.. వినోదాలు.. సంబ‌రాల పేరిట ఆహారాన్ని వృధా చేస్తూ.. కుప్ప‌తొట్టికి ప‌రిమితం చేసే ధోర‌ణుల‌పై తెలుగు రాష్ట్రాల‌కు స‌మీపంలో ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రం కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది.

విందులు.. వినోదాల వేళ భారీగాసాగుతున్న ఆహార‌వృధాపై క‌ర్ణాట‌క స‌ర్కారు క‌న్నెర్ర చేసింది. హోట‌ళ్ల‌తో పాటు రెస్టారెంట్ల‌లో ఆహార‌వృధాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇటీవ‌ల బెంగ‌ళూరు వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం చేసిన అధ్య‌య‌నంలో ఏటా 943 ట‌న్నుల ఆహారం చెత్త‌కుప్ప‌పాలు అవుతుంద‌ని గుర్తించారు.

దీంతో ఇలాంటి వృధాను అరిక‌ట్టేందుకు బెంగ‌ళూరుతో స‌హా రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో ఎక్క‌డైనా స‌రే ఆహారాన్ని వృథా చేస్తే జ‌రిమానాతో పాటు.. జైలుశిక్ష విధించేలా చ‌ట్టాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చట్టం కానీ అమ‌ల్లోకి వ‌స్తే ఆహారం వృథాగా ప‌డేసే వారికి గ‌రిష్ఠంగా ఆరునెల‌ల వ‌ర‌కూ జైలుశిక్ష‌.. రూ.10వేల వ‌ర‌కూ జ‌రిమానా విధించ‌నున్నారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే రాష్ట్ర న్యాయ‌శాఖ‌.. క‌ర్ణాట‌క ఆహార వ్య‌ర్థ నియంత్ర‌ణ.. వినిమ‌య చ‌ట్టం పేరిట ఒక ముసాయిదా బిల్లును రూపొందిస్తున్నారు. క‌ల్యాణ మండ‌పాలు.. హోట‌ళ్లు.. సంస్థ‌లు.. స‌మూహాలు ఈ బిల్లుప‌రిధిలోకి తీసుకొస్తున్నారు.

ముసాయిదా బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత‌.. ప్ర‌తి జిల్లాలో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తారు. ఆహార‌.. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో పాటు జిల్లా ఎస్పీ.. జిల్లా పంచాయితీ అధ్య‌క్షులు స‌భ్యులుగా ఉంటారు. త‌మ దృష్టికి వ‌చ్చిన ఫిర్యాదుల‌తో పాటు.. కొన్నిసార్లు త‌మ‌కు తామే సుమోటోగా కూడా కేసులు న‌మోదు చేసే వీలు ఉంది. ఈ త‌ర‌హా కేసుల విచార‌ణ‌కు జిల్లాకో కోర్టును ఏర్పాటు చేస్తారు.

ఆహారాన్ని వృథాగా ప‌డేసిన‌ట్లు నిరూపిత‌మైతే.. అందుకు కార‌ణ‌మైన రెస్టారెంట్ య‌జ‌మానులు.. క‌ల్యాణ మండ‌పాల నిర్వాహ‌కుల‌తో పాటు పెళ్లిళ్లు.. విందులు నిర్వ‌హించిన వారికి సైతం శిక్ష‌లు వేస్తారు. మ‌రి.. ఈ త‌ర‌హా చ‌ట్టాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ‌లుచేస్తే.. అన‌వ‌స‌ర వృథాను అడ్డుకున్న‌ట్లు అవుతుంది. మ‌రి.. ఈ విష‌యంలో ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఎవ‌రు ముందు స్పందిస్తారో చూడాలి.