Begin typing your search above and press return to search.

క్వారంటైన్‌ లో ఉన్నవారు సెల్ఫీ వీడియోలు పంపండి

By:  Tupaki Desk   |   31 March 2020 1:00 PM GMT
క్వారంటైన్‌ లో ఉన్నవారు సెల్ఫీ వీడియోలు పంపండి
X
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి భయంను కలిగిస్తుంది. ఇండియాలో కరోనా వైరస్‌ అంత స్పీడ్‌ గా లేదులే అనుకుంటున్న సమయంలో రోజు రోజుకు కేసుల సంఖ్య వందల్లో పెరుగుతుంది. వచ్చే వారంకు ఈ సంఖ్య వేలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటూ పాజిటివ్‌ కేసులను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. విదేశాల నుండి వచ్చిన వారిని.. ఇంకా వారితో కలిసిన వారిని సెల్ఫ్‌ క్వారెంటైన్‌ లో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే కొందరు సెల్ఫ్‌ క్వారెంటైన్‌ ను పాటించకుండా ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. దాంతో వైరస్‌ వ్యాప్తి మరింతగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో సెల్ఫ్‌ క్వారెంటైన్‌ లో ఉన్న వారికి విచిత్రమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

క్వారెంటైన్‌ లో ఉన్న వారు గంట గంటలకు నిమిషం నిడివి ఉన్న సెల్ఫీ వీడియోను తీసి పంపించాలంటూ ఆర్డర్‌ వేసింది. ఎవరి సెల్ఫీ వీడియో మిస్‌ అయినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఈ విషయమై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్‌ నోట్‌ ను విడుదల చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో మొత్తంగా 23152 మంది సెల్ఫ్‌ క్వారెంటైన్‌లో ఉన్నారు. వారంతా కూడా ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నా మూడు నాలుగు రోజుల్లో వారిలో కొందరు అయినా పాజిటివ్‌ కేసులుగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది.

అందుకే వారిని బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారందరిని కూడా క్వారెంటైన్‌ చేయడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచారు. వారికి మరింత భయం ఉండాలనే ఉద్దేశ్యంతో గంట గంటకు ఇలా సెల్ఫీ వీడియోలు పంపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు మంచిదే అంటున్నారు.