Begin typing your search above and press return to search.

ఐపీఎల్ రద్దు చేయాలి అంటూ కేంద్రానికి లేఖ రాసిన కర్ణాటక సర్కార్ !

By:  Tupaki Desk   |   10 March 2020 11:00 AM GMT
ఐపీఎల్ రద్దు చేయాలి అంటూ కేంద్రానికి లేఖ రాసిన కర్ణాటక సర్కార్ !
X
ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకి పండుగ, సిక్స్ లు ఫోర్ లు హై స్కోర్ లు, అబ్బో,,, క్రికెట్ అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఏ ఎంటర్టైన్మెంట్. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఐపీఎల్ ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ఐపీఎల్ వల్ల ఎందరో ప్లేయర్స్ కి లైఫ్ వచ్చింది, ఫారిన్ ప్లేయర్స్ మొదలు ఇండియన్ ప్లేయర్స్ వరకు ఎందరికో లైఫ్ ఇచ్చింది ఐపీఎల్. ఇకపోతే ఈసారి ఐపీఎల్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ఐపీఎల్‌ 2020 సీజన్‌ పై కూడా ప్రభావం చూపించబోతుంది. ఓవైపు రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యం లో ఐపీఎల్ పై నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్-13వ సీజన్ జరుగుతుందని రోజుకో ప్రకటన విడుదల చేస్తుంది. స్వయంగా బీసీసీఐ అధినేత సౌరవ్ గంగూలీనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ క్యాచ్ రిచ్ లీగ్‌ పై వస్తున్న ఊహాగానాలను ఖండిస్తున్నా.. ఈ మెగాలీగ్ నిర్వహించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భయ పడుతున్నాయి.

మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్‌ను వాయిదా వేయాలనగా.. నేడు కర్ణాటక ప్రభుత్వం తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను నిర్వహించమని ప్రకటించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఇక సోమవారం కర్ణాటకలో తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా బెంగళూరు కు వచ్చిన ఓ టెక్కీ కి కరోనా పాజిటివ్ వచ్చింది. అతన్ని వెంటనే రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌ లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అయితే రోగి పరిస్థితి నిలకడగా ఉందంటున్న అధికారులు..ముందస్తుగా అతని భార్య, పిల్లలను కూడా ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఇప్పటికే బెంగళూరులోని అన్ని స్కూళ్లను మూసివేశారు.

బెంగళూరు లో కరోనా కేసు నమోదవ్వడంతో ఐపీఎల్‌‌ ను నిర్వహించమని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు స్థానిక దిగ్విజయ్ 24/7 చానెల్ తెలిపింది. అలాగే కుదిరితే ఐపీఎల్ 2020 సీజన్‌ ను రద్దు చేయాలని లేకుంటే.. వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కూడా తెలిపింది. దీంతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మ్యాచ్‌లపై గందరగోళం నెలకొంది. అలాగే రెండు రోజుల క్రితం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపె కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ వాయిదా వేయడమే ఉత్తమమన్నాడు. 'ప్రజలు ఎక్కువ సంఖ్యలో గమిగూడితే.. వైరస్‌ ప్రభావం దారుణంగా ఉంటుంది. ఇలాంటి టోర్నీలు తర్వాత కూడా నిర్వహించుకోవచ్చు' అని మంత్రి మీడియా సమావేశంలో అన్నారు. దీనితో మరోసారి ఐపీఎల్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.