Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా చూసుకోండి.. ఆ అధికారిణులకు కర్ణాటక సర్కారు షాక్..

By:  Tupaki Desk   |   21 Feb 2023 5:49 PM GMT
సోషల్ మీడియా చూసుకోండి.. ఆ అధికారిణులకు కర్ణాటక సర్కారు షాక్..
X
ఒకరు ఐఏఎస్.. మరొకరు ఐపీఎస్.. అఖిల భారత సర్వీసుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉండే సర్వీసులు. ఎంతో క్రమశిక్షణ, పట్టుదల మరెంతో దీక్ష ఉంటే తప్ప ఆ సర్వీసులను సాధించలేం. ఇక వారి శిక్షణ కూడా అంతే కఠినంగా, ఉన్నతంగా ఉంటుంది. దేశ పాలనా వ్యవస్థ్లలో కీలకమైన సర్వీసులు కాబట్టి ఆ మాత్రం నియమాలు తప్పనిసరి. కానీ, కర్ణాటకలో మహిళా యువ ఐఏఎస్, యువ ఐపీఎస్ మాత్రం హద్దు మీరారు. ప్రొఫెషనల్ గా కాకుండా పర్సనల్ గా వైరానికి దిగారు. దీనికి సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకున్నారు. ఫలితం.. కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన వారు మచ్చను మిగుల్చుకున్నారు. సోషల్ మీడియాకు ఎక్కి పరువు తీసుకున్న ఆ ఇద్దరిలో ఒకరు తెలుగువారు కావడం గమనార్హం. ఇదంతా కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఐఏఎస్‌ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్‌ ఎండీ ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ గురించి. వీరి వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సీఎం ఆగ్రహం.. షాక్

మహిళా ఉన్నతాధికారులకు ఊహించని షాక్ ఇస్తూ.. పోస్టింగ్ ఇవ్వకుండానే తక్షణమే బదిలీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. వివాదం చెలరేగిన మరుసటి రోజునే ఇద్దరినీ వారివారి శాఖల నుంచి గెంటేసినంత పనిచేసింది. చీఫ్ సెక్రటరీ వద్ద ఫిర్యాదు చేసిన మరుసటి రోజు మంగళవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. అధికారిణుల తీరుపై సీఎం బసవరాజ్‌ బొమ్మై ఇప్పటికే మండిపడ్డారు. నోటీసులు జారీ చేయాలని చీఫ్‌ సెక్రటరీని సోమవారం ఆదేశించారు. అదే రోజు రోహిణి సింధూరి విధానసౌధలో చీఫ్‌ సెక్రటరీ వందితాశర్మను కలిశారు. రూపా మౌద్గల్‌ ఆరోపణలకు నాలుగు పేజీలతో కూడిన వివరాలను అందించారు.

తనపై సోషల్‌ మీడియాలో నిరాధార, అబద్ధాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారని, సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించిన మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మీడియా ముందుకు రాకూడదనే నిబంధన ఉందన్నారు. కానీ రూప వ్యక్తిగతంగా తనతోపాటు తన భర్తపైనా ఆరోపణలు చేశారన్నారు. చీఫ్‌ సెక్రటరీకి సమగ్రంగా వివరాలు అందించానని తెలిపారు. మండ్యలో సీఈఓగా శౌచాలయాలు రికార్డు స్థాయిలో నిర్మించినందుకు కేంద్రం గుర్తించిందని, ఇన్నేళ్ల తర్వాత ఆరోపణలు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు ఫొటోలు పంపాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జాలహళ్లిలోని నివాసం తన అత్తగారికి చెందినదన్నారు.

పోస్టింగ్ లేదు.. పని లేదు

ఏస్థాయి ఉద్యోగికైనా ఖాళీగా కూర్చుని జీతాలు తీసుకోవడం చాలా ఇబ్బందికరం. ఏ పనీ లేకుండా గంటల పాటు ఉండడం అసహజంగా ఉంటుంది. ప్రయివేటు కంపెనీల్లో ఇలాంటి ఉదంతాలు చాలా చూశాం. ప్రభుత్వ శాఖల్లో కొంత సహజమే అయినా పని లేకుండా ఉండడం ఇబ్బందికరమే. ఇప్పుడిదే పరిస్థితి రోహిణి, రూపలకు ఎదురైంది. వారిని ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం.. పోస్టింగ్‌ మాత్రం ఇవ్వలేదు. విశేషమేమంటే రూపా మౌద్గిల్‌ భర్త మునీష్‌ మౌద్గిల్‌ ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటివరకు రెవెన్యూ విభాగంలో కమిషనర్‌గా ఉన్న ఆయన్ను డీపీఏఆర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించింది.

సర్కారుకెళ్లకుండా.. సోషల్ మీడియాకెక్కి..

రోహిణీ, రూప మధ్య సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వివాదం రేగడం.. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం తెలిసిందే. వీరిలో రోహిణి ఐఏస్. ఆమెపై ఆరోపణలు చేస్తూ ఐపీఎస్‌ రూప ఫేస్ బుక్ లో పోస్టు చేయడం వివాదానికి కారణమయ్యింది. రెచ్చగొట్టేలా ఉన్న ఫొటోలను కొందరు ఐఏఎస్‌లకు రోహిణి పంపించారని అందులో ఆరోపించారు. రూప ఆరోపణలపై స్పందించిన రోహిణి.. 'ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. నిరాధార ఆరోపణలు చేస్తూ, వాటిని రుజువు చేయమంటున్నారు' అంటూ తిప్పికొట్టారు.

కాగా, ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు మహిళా అధికారులు చీఫ్‌ సెక్రటరీ వందితా శర్మకు పరస్పరం ఫిర్యాదు కూడా చేసుకున్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై.. అఖిల భారత సర్వీసు నిబంధనలకు కట్టుబడి ఉండాలంటూ ఇద్దరు మహిళా అధికారులకు చీఫ్‌ సెక్రటరీ మౌఖికంగా, లిఖితపూర్వకంగా సూచించారని అన్నారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో మహిళా ఉన్నతాధికారుల దూషణల తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వారిపై బదిలీ వేటు వేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.