Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రం బంపర్ ఆఫర్.. ఈ రెండు సండేల్లో పెళ్లిళ్లకు ఓకే

By:  Tupaki Desk   |   22 May 2020 3:45 AM GMT
ఆ రాష్ట్రం బంపర్ ఆఫర్.. ఈ రెండు సండేల్లో పెళ్లిళ్లకు ఓకే
X
గడిచిన రెండు నెలలకు పైగా సాగుతున్న లాక్ డౌన్ దెబ్బకు జీవితం.. వేగంగా సాగిపోతున్న వాహనాన్ని ఒక్కసారి సడన్ బ్రేక్ వేసిన చందంగా మారిపోయింది. అప్పటివరకూ అలవాటైనవేమీ అందుబాటులో లేకుండా.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ పరుగులు పెట్టే జీవనసిత్రం ఛేంజ్ అయిపోయింది. సమయం అన్నది లేక.. తల్లడిల్లిపోతున్న జనాలకు బోలెడంత విరామాన్ని ఇచ్చింది. ఇంటి పట్టున ఉండటమే లేని వారందరికి లాక్ డౌన్ పుణ్యమా అని.. ఇంట్లోనే ఉండిపోవాల్సిన విచిత్రమైన పరిస్థితి.

ఇలాంటివేళ.. కోటి కలలతో పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్న వారు పడుతున్న తిప్పలు అన్నిఇన్ని కావు. జీవితంలో అత్యంత కీలకమైన వేడుకగా భావించే వివాహం.. అనుకున్న టైంలో కాకుండా ఎప్పుడు జరుగుతుందో తెలీని విచిత్రమైన పరిస్థితి. సర్లే.. మూడు వారాలేగా అనుకున్న వారికి..ఏకంగా తొమ్మిది వారాలు దాటుతున్నా.. రానున్న రోజులు ఎలా ఉంటాయో ఏ మాత్రం అర్థం కావట్లేదు. ఇలాంటివేళ.. పెళ్లి వేడుకలు పెట్టుకున్న వారు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు.

ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలోని పలువురు తమ పెళ్లిళ్ల గురించి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నెల 24.. 31 తేదీల్లో మంచి ముహుర్తం ఉంది. దీంతో.. ఈ రెండు తేదీల్లో భారీగా పెళ్లిళ్లు చేసుకోవాల్సి ఉంది. లాక్ డౌన్ పుణ్యమా అని నెలకొన్న కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టేస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది కర్ణాటక రాష్ట్రం. ఈ రెండు ఆదివారాల్లో పెళ్లిళ్లు చేసుకోవాల్సిన వారంతా చేసుకోవచ్చని పచ్చజెండా ఊపేసింది.

పెళ్లికి వచ్చే అతిధుల విషయంలో కేంద్రం విధించిన మార్గదర్శకాల్ని మాత్రం మిస్ కాకూడదని స్పష్టం చేసింది. దీంతో.. ఈ రెండు ముహుర్తాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్న వారంతా తమకు అందిన స్వీట్ న్యూస్ కు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తరహా నిర్ణయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్థానిక అవసరాలకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.