Begin typing your search above and press return to search.

మహిళల నుంచి చీవాట్లు తిన్న సినిమా హీరో?

By:  Tupaki Desk   |   11 April 2023 5:45 PM GMT
మహిళల నుంచి చీవాట్లు తిన్న సినిమా హీరో?
X
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ మేరకు పార్టీలు ఓట్లు అడగడానికి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ గ్రామంలోకి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి కుమారుడు ఎన్నికల ప్రచారానికి వెళ్లగా అతడికి చుక్కెదురైంది. స్థానిక మహిళల ఎదుట పరాభవం కలిగింది. మా గ్రామంలోకి ఎందుకు వచ్చారని మహిళలు నిలదీశారు. ఏ మొహం పెట్టుకుని వచ్చారు? ఐదేళ్లుగా మా బాగోగులు పట్టని వారికి ఓట్లు అడిగే హక్కు లేదని చీవాట్లు పెట్టారు.

ఈ నేపథ్యంలో మహిళల నుంచి ఊహించని ఎదురుదాడి జరగడంతో వెనుదిరగక తప్పలేదు. తమ గ్రామంలో కనీస సదుపాయాలు లేవని మండిపడ్డారు. తాగునీరు కరువు, మురుగునీటి కాలువలు నిర్మించలేదు. పారిశుధ్యం జాడే లేదు. ఇలా ఇన్ని రకాల సమస్యలతో సతమతమవుతున్నా కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు మాత్రం మాకు ఓటు వేయాలని రావడంలో మీ ఉద్దేశమేమిటని ప్రశ్నించారు.

కర్ణాటక రాష్ట్రంలోని రామనగర నియోజకవర్గంలోని హారోహల్లి తాలూకాలోని బాదగెరగె గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కుమారస్వామి తనయుడు, సినిమా హీరో నిఖిల్ కుమార స్వామి వచ్చారు. తీరా గ్రామంలోకి వచ్చాక మహిళల నుంచి ఎదురైన చేదు అనుభవానికి అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. మీ సమస్యలు తీరుస్తామని నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు.

ఇంతకీ ఇక్కడ పోటీలో ఉన్నది ఎవరో తెలుసా? కుమారస్వామి భార్య అనిత ఇక్కడ నుంచి బరిలో నిలవడం గమనార్హం. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురు కావడంతో చేసేది లేక వెనుదిరిగి పోయారు. అనిత జేడీఎస్ తరఫున బరిలో నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్ సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. దీంతో వారికి ఎదురైన పరాభవానికి కుంగిపోతున్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

మా గ్రామంలోకి జేడీఎస్, కాంగ్రెస్ కాదు బీజేపీ నేతలు కూడా రావొద్దు. మా సమస్యలు పరిష్కరించే వరకు మేం ఎవరికి ఓటు వేయమని భీష్మించుకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడనుంది. ఎవరికి ఓటు వేస్తారో ఎవరిని ఇంటికి సాగనంపుతారో తెలియడం లేదు. మొత్తానికి ప్రజల్లో వస్తున్న చైతన్యంతో పార్టీలు డైలమాలో పడుతున్నాయి.