Begin typing your search above and press return to search.

క‌న్న‌డ‌లో కొత్త రికార్డు సృష్టిస్తున్న‌ మాజీ సీఎం

By:  Tupaki Desk   |   19 April 2018 3:01 PM GMT
క‌న్న‌డ‌లో కొత్త రికార్డు సృష్టిస్తున్న‌ మాజీ సీఎం
X
క‌న్న‌డ రాజ‌కీయం హాట్ హాట్‌ గా మారుతోంది. అన్నిపార్టీలు యువ‌నేత‌ల జ‌పం చేస్తున్న‌ప్ప‌టికీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం...త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అధికార, ప్ర‌తిప‌క్షాల‌నే తేడా లేకుండా,తాజా మాజీల‌నే విబేధాలు కూడా లేకుండా అంతా త‌మ వారసుల‌ను రంగంలోకి దింపుతున్నారు. మీది కుటుంబ పాలనంటే.. మీది కుటుంబ పాలనంటూ దూషించుకునే పార్టీలు.. నాయకులు.. తమ వారసులకు టికెట్లు ఇచ్చుకోవడంలో మాత్రం ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో 8 మంది మాజీ ముఖ్యమంత్రుల పుత్రరత్నాలు పోటీలో నిలవ‌డం ప్ర‌త్యేక రికార్డుగా ప‌లువురు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ర్టాల్లో త‌మ వార‌సుల‌కు పెద్ద‌పీట వేస్తున్న రీతిలోనే క‌న్న‌డలోని ఆయా పార్టీలు సైతం వ్య‌వ‌హ‌రిస్తున్నాయని అంటున్నారు.

వారసత్వ రాజకీయాలకు మేం దూరం,.. మీదే కుటుంబ పాలన అంటూ రాజకీయ నాయకులు..ఒకరినొకరు దూషించుకోవడం చూస్తూనే ఉంటాం. ఎదుటి వారిని విమర్శించే నేతలు.. తమ విషయానికి వచ్చే సరికి మాత్రం నీతులు పాటించడం లేదు. ఇందుకు నిద‌ర్శ‌నం కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. మాజీ ముఖ్యమంత్రుల కుమారులు 8 మంది పోటీలో నిలిచారు. ఏమాత్రం అవకాశం ఉన్నా బీజేపీపై నిప్పులు చెరిగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రకు పట్టుబట్టి టికెట్‌ ఇప్పించుకున్నారు. అటు కాంగ్రెస్‌వి వారసత్వ రాజకీయాలు అని విమర్శించే యడ్యూరప్ప సైతం తన కుమారుడు విజయేంద్రను ఎన్నికల బరిలో నిలిపారు. వీరిద్దరూ వరుణ నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా పోటీ పడుతుండడం విశేషం.

మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ కుమారులు రేవణ్ణ - కుమారస్వామి మ‌రోమారు బ‌రిలో దిగుతున్నారు. రేవణ్ణ హోలెనరసిపుర నుంచి.. కుమారస్వామి రామనగర - చెన్నపట్టణ స్థానాల నుంచి... జేడీఎస్ తరఫున పోటీ చేయనున్నారు. మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ తనయుడు అజయ్‌ సింగ్‌ కల్బుర్గి జిల్లా జేవర్గి నుంచి పోటీ చేయనున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్‌ తనయుడు మహిమా పటేల్ జేడీయూ తరఫున చన్నగిరి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారు. అలాగే మాజీ సీఎం సోమప్ప రాయప్ప బొమ్మై తనయుడు బసవరాజ బొమ్మై... బీజేపీ టికెట్‌ మీద షిగ్గావ్‌ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ప‌రిణామాల‌తో అన్ని పార్టీలు ఆ తాను ముక్క‌లేన‌ని చ‌ర్చించుకుంటున్నారు.