Begin typing your search above and press return to search.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. సీఎం బొమ్మై రియాక్షన్‌ ఇదే!

By:  Tupaki Desk   |   13 May 2023 3:09 PM GMT
కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. సీఎం బొమ్మై రియాక్షన్‌ ఇదే!
X
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరి మద్దతు అవసరం లేకుండా మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 113ను అధిగమించింది. మొత్తం 224 స్థానాలకు గానూ 135 సీట్లలో విజయ ఢంకా మోగిస్తోంది. మరోవైపు బీజేపీ 70లోపు స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ ఘోర పరాభవంపై కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మెజార్టీ సాధిచడంలో విఫలమయ్యామని వెల్లడించారు. ఫలితాలను విశ్లేషిస్తామన్నారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.

తమ లోటుపాట్లను అధిగమించి ముందుకెళ్తామని బొమ్మై వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. మళ్లీ బీజేపీ స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌ ఇస్తుందన్నారు.

భారతీయ జనతా పార్టీ ముద్ర వేయలేకపోయిందని, కాంగ్రెస్‌ విజయవంతంగా చేసిందని అన్నారు. "మేము ముద్ర వేయలేకపోయాం. కాంగ్రెస్‌ విజయవంతంగా ఆ పని పూర్తి చేసింది... ఫలితాలు వచ్చిన తర్వాత మేము సమగ్ర విశ్లేషణ చేస్తాం. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు, అంతరాలు ఉన్నాయో విశ్లేషించుకుంటాం. వాటిని రిపీట్‌ కాకుండా చూస్తాం. మేము ఈ ఫలితాన్ని మా పురోగతిలోకి తీసుకుంటాం" అని కర్ణాటక ముఖ్యమంత్రి విలేకరులతో అన్నారు.

కాగా బసవరాజ్‌ బొమ్మై సొంత జిల్లా అయిన హవేరిలో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఐదు చోట్ల బీజేపీ ఓడిపోయింది. ఐదు చోట్లా కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలిచారు. మరో స్థానంలో షిగ్గావ్‌ లో బసవరాజ్‌ బొమ్మై 20 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప కూడా ఫలితాలపై స్పందించారు. గెలుపు ఓటములు తమకు కొత్తేం కాదన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవవరం లేదని తెలిపారు. పార్టీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరిశీలన చేసుకుంటామన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్లు స్పష్టం చేశారు.