Begin typing your search above and press return to search.

ప్రముఖులు తిరిగిన చోట గెలుపు ఎవరికి ఎంత?

By:  Tupaki Desk   |   14 May 2023 12:01 PM GMT
ప్రముఖులు తిరిగిన చోట గెలుపు ఎవరికి ఎంత?
X
ఎన్నికల వేళ స్టార్ క్యాంపైనర్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో అదెంత ప్రభావం చూపించింది? వారి ప్రచారంతో ఓట్లు ఎన్ని రాలాయి? విజయంలో ప్రచారం కలిసి వస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల్ని పరిశీలించినప్పుడు అర్థమయయేదేమంటే.. ప్రజలు ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటారో.. ఎవరి నాయకత్వాన్ని తమకు మంచిదని భావిస్తారో.. వారి యాత్రలకు ఓట్లు.. సీట్లు రాలతాయి. అంతే తప్పించి.. ప్రముఖులు పర్యటించారు కాబట్టి ఓట్లు వేయాలన్న ఆలోచన అస్సలు చేయరన్న విషయం అర్థమవుతుంది. ఈ వాదనకు బలం చేకూరేలా అంశాలు.. కర్ణాటక ఎన్నికల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

మిగిలిన వారందరిని కాసేపు పక్కన పెడదాం. కర్ణాటక ఎన్నికల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటకకు ఎన్నిసార్లు వచ్చారు? ఎంతలా పర్యటించారో చెప్పాలా? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికల కోసం ఇన్నిసార్లు పర్యటించటమా? అని విస్మయానికి గురయ్యే పరిస్థితి. కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోడీ 19 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆరు రోడ్ షోలు నిర్వహించారు. చివరగా బెంగళూరు మహానగరంలో 26 కిలోమీటర్ల మేర రోడ్ షోను చేపట్టారు. నీట్ ఎగ్జామ్ ఉండటంతో తగ్గారు కానీ.. లేకుంటే మరో 20 కిలోమీటర్లు అదనంగా పర్యటించేవారే.

మోడీనే ఇంతలా తిరిగి ప్రచారం చేసినప్పుడు.. బీజేపీ ముఖ్యులు మాత్రం రాకుండా ఉంటారా? కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరో పదిహేను మంత్రి కేంద్రమంత్రులు.. పలు రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రులు.. 128 మంది జాతీయనేతలు.. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు హాజరయ్యారు. ఇంతా చేస్తే.. బీజేపీకి దక్కిన సీట్లు అక్షరాల 66.

బీజేపీ తరఫున కొందరు స్టార్ క్యాంపెయిన్లను దించారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ నటుల్లో ఒకరు కిచ్చా సుదీప్. ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేశారు. సుదీప్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో.. ఆయన్ను ఆయా వర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే చోట ఎన్నికల ప్రచారాన్ని చేసేలా ప్లాన్ చేశారు. ఎందుకంటే..కర్ణాటక జనాభాలో ఈ వర్గానికి చెందిన వారు6.6శాతం మంది ఉన్నారు. చిత్రదుర్గ.. బళ్లారి.. రాయచూర్.. దావణగెరె జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. 2008లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అధిక స్థానాల్ని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో సుదీప్ మూడు జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అయితే.. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా విజయం సాధించకపోవటం గమనార్హం. ఇక.. కర్ణాటకలో జరిగే ఎన్నికల ప్రచారానికి పొరుగున ఉన్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రంగంలోకి దిగారు. ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఓడిపోవటం ఆయనకు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితికి వెళ్లిపోయారు.

అభ్యర్థుల ఎంపికలోనూ అన్నామలై తీసుకున్న నిర్ణయాలు కొన్ని కర్ణాటక బీజేపీ నేతల్లో అసంతృప్తికి కారణమైంది. దశాబ్దాల తరబడి పార్టీలో పని చేసిన వారికి సీటు ఇవ్వకుండా కొత్త వారికి సీటు ఇవ్వటంపై పలువురు మండిపడ్డారు. ఆయన తీరుపై అధినాయకత్వానికి కంప్లైంట్లు చేశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఓడిన అభ్యర్థుల్లో చాలావరకు అన్నామలై ఎంపిక చేసిన వారే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తన జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పర్యటించిన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు భారీగా విజయం సాధించటం ఆసక్తికరంగా మారింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో మొత్తం 20 నియోజకవర్గాల్లో సాగింది. అందులో 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించటం ఆసక్తికరంగా మారింది.