అంచనాలు నిజమయ్యాయి. రేపో.. మాపో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందన్న మాటకు తగ్గట్లే కొద్దిసేపటి క్రితం (మంగళవారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో) ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు మే 12న పోలింగ్ జరగనుండగా.. మే 15న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు వెల్లడించింది. పోల్ షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ ఎన్నికల్లో మొత్తం ఐదుకోట్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించనున్నారు. కన్నడ నాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 2.51 కోట్ల పురుష ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించనుండగా.. 2.44 కోట్ల మంది మహిళలు ఓటు వేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి 60 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించనుండటం గమనార్హం.
పెరిగిన ఓటర్ల నేపథ్యంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తొమ్మిది శాతం ఎక్కువగా పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56,696 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 28తో ముగియనుంది. ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కన్నడ రాజకీయం మరింత వేడెక్కటం ఖాయం.