Begin typing your search above and press return to search.

దళిత ఎంపీని ఊళ్లోకి రానీయని అగ్రవర్ణాలు

By:  Tupaki Desk   |   17 Sep 2019 9:50 AM GMT
దళిత ఎంపీని ఊళ్లోకి రానీయని అగ్రవర్ణాలు
X
కులం కట్టుబాట్లను కూల్చేద్దాం.. ధ్వంసం చేద్దామని మీడియా, నేతలు గళమెత్తుతున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. దళితులైన గ్రామస్థులే కాదు.. ఏకంగా దళిత ఎంపీనే ఘోరంగా అవమానించిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఓ ప్రజాప్రతినిధిని దళితుడని ఆ ఊరిలోని అగ్రవర్ణాలు రానీయకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కర్ణాటక రాష్ట్రంలోని తుముకురు జిల్లా చిత్రదుర్గం ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు ఏ.నారాయణ స్వామి. ఎస్సీ రిజర్వుడు కావడంతో దళితుడైన నారాయణ స్వామి నిలబడ్డాడు. ఈయనకే ఓటేసి గెలిపించారు. ఓటేసినప్పుడు లేని కులవివక్ష ఇప్పుడు గ్రామంలో పర్యటిస్తే వచ్చింది. మంగళవారం ఎంపీ నారాయణ స్వామి తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లగా ఘోర అవమానం ఎదురైంది.

పరిశ్రమల ఏర్పాటు కోసం ఎంపీ నారాయణ స్వామి ఫార్మా సిబ్బంది - వైద్యులతో కలిసి గోల్లర హట్టి గ్రామానికి బయలుదేరారు. ఊరిలోకి ఎంట్రీకాగానే ఎంపీని ఆ ఊరిలోని అగ్రవర్ణాలు - బీసీలు అడ్డుకున్నారు. ఎంపీ అయినప్పటికి నారాయణ స్వామి దళితుడు అని.. తమ గ్రామంలోకి ప్రవేశం లేదని అడ్డుచెప్పారు. దీంతో అధికారులు, అనుచరులు షాక్ కు గురయ్యారు. ఎంపీని గ్రామస్థులు ఎంతకు పోనీయకపోవడంతో చేసేందేం లేక వెనుదిరిగారు.

దళితుడు అని ఎంపీనే ఊళ్లోకి రానీయని వ్యవహారం కర్ణాటకతోపాటు దేశమంతా దుమారం రేపింది. దీనిపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఎంపీని అడ్డుకున్న అగ్రవర్ణ సామాజికవర్గానికి చెందిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.