Begin typing your search above and press return to search.

కర్ణాటక మంత్రులను వణికిస్తున్న రూం నెం.329

By:  Tupaki Desk   |   28 May 2023 9:33 AM GMT
కర్ణాటక మంత్రులను వణికిస్తున్న రూం నెం.329
X
మంత్రాలకు చింతకాయలు రాలవు. అలానే మూఢనమ్మకాలు కూడా అంటూ మాటలు చెప్పేందుకు చాలామంది చాలానే చెప్పేస్తారు. తీరా విషయంలోకి వెళ్లిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు నమ్మకాల కోణం చుట్టూనే తిరుగుతూ ఉంటారు. తాజాగా అలాంటి సీనే కర్ణాటక మంత్రుల విషయంలో నెలకొంది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే.
పెద్ద ఎత్తున చోటు చేసుకున్న తర్జనభర్జనల అనంతరం ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను ఎంపిక చేయటం.. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ సర్దుకుపోవటంతో ప్రభుత్వ ఏర్పాటు పూర్తి అయ్యింది. సిద్దూ మంత్రివర్గంలో మొత్తం 34 మంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. తాజాగా ఒక విషయంలో మంత్రులంతా వణికిపోతున్నారు.

మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వేళ.. వారికి ఛాంబర్లు కేటాయించటం తెలిసిందే. ఎవరికి ఏ ఛాంబర్ ఇచ్చినా ఫర్లేదు కానీ.. రూం నెంబరు 329 మాత్రం తమకు కేటాయించొద్దంటే.. తమకు కేటాయించొద్దని చెప్పటం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. ఈ గదిని కేటాయించిన మంత్రులంతా అకాల మరణం చెందుతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే ఛాంబర్ ను గతంలో కాంగ్రెస్ హయాంలో కీలక మంత్రిగా వ్యవహరించిన మహదేవ్ ప్రసాద్ గుండెపోటుతో మరణించారు.

ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంలోనూ సీనియర్ నేతగా సుపరిచితుడు ఉమేశ్ కత్తి సైతం ఇదే చాంబర్ ను కేటాయించటం.. ఆయన కూడా గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆ ఛాంబర్ ను తీసుకోవాలంటే మంత్రులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో.. మిగిలిన చాంబర్లలో ఏది కేటాయించిన ఫర్లేదు కానీ 329 నెంబరు ఛాంబర్ మాత్రం వద్దంటే వద్దని చెప్పేస్తున్నారు. ఈ ఛాంబర్ కు సంబంధించిన అంశంపై మంత్రులు కేజే జార్జ్‌, సతీశ్‌జార్కిహొళి, ప్రియాంకఖర్గే, మునియప్ప, ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డిలు అయితే.. ఏకంగా తమకు వద్దని ఓపెన్ గా చెప్పేశారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో మరింత ట్విస్టు ఏమంటే.. మూఢ నమ్మకాల్ని పట్టించుకోకుండా.. అలాంటి వాటికి దూరంగా ఉండే సతీశ్ జార్కిహోళి సైతం ఛాంబర్ 329 తనకు కేటాయించొద్దని చెప్పటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఛాంబర్ ను ఎవరికి కేటాయిస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కొంతమంది అన్నట్లు.. అసలు ఈ ఛాంబర్ ను ఎవరికి కేటాయించకుండా ఉంటే సరిపోతుంది కదా అని. మరేం జరుగుతుందో చూడాలి.